జర్రెల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిపై దాడి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:19 AM
మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు.
సీనియర్లు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
విచారణ చేపట్టిన తహశీల్దార్, పోలీసులు
గూడెంకొత్తవీధి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు. దీంతో బుధవారం తహశీల్దార్ అన్నాజీరావు, పోలీసులు, అధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులను వేర్వేరుగా విచారించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. సోమవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో విద్యార్థులందరూ వసతి గృహాల్లో నిద్రించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో పాఠశాల పూర్వ పదవ తరగతి, ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులు ఏడవ తరగతి విద్యార్థి పాంగి దుర్గాను ర్యాగింగ్ తరహాలో టీజింగ్ చేశారు. ఆ గుంపులో నుంచి గుర్తు తెలియని విద్యార్థి దుర్గా మెడపై పదునైన గాజుతో దాడి చేశాడు. దీంతో ఆ బాలుడి మెడ భాగం తెగిపోయింది. మంగళవారం ఉదయం హెచ్‌డబ్ల్యూవో వేణు గాయపడిన విద్యార్థిని నర్సీపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా వుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ టి.నిషాంతి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ మేరకు తహశీల్దార్ అన్నాజీరావు, మండల పరిషత్ ఏవో ఇమ్మానుయేలు, ఏటీడబ్ల్యూవో బి.జయనాగ లక్ష్మి, ఎస్‌ఐ సురేశ్‌కుమార్ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ విద్యార్థి దుర్గాపై దాడి చేసినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాత్రి వేళ హెచ్‌డబ్ల్యూవో పాఠశాలలో లేరని అధికారులకు హెచ్‌ఎం తెలియజేసినట్టు తహశీల్దార్ తెలిపారు. ఈ విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపించామని తహశీల్దార్ అన్నాజీరావు తెలిపారు.