Share News

తాగునీటికి తిప్పలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:48 AM

నగరంలో నీటిఎద్దడి నేపథ్యంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాగునీటికి తిప్పలు

పనిచేయని డయల్‌యువర్‌ ట్యాంకర్‌

ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన నిల్‌

ప్రైవేటును ఆశ్రయిస్తున్న నగరవాసులు

(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)

నగరంలో నీటిఎద్దడి నేపథ్యంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ప్రజలు కటకటలాడుతుండగా, మరికొన్నిచోట్ల నిత్యావసరాలకు కూడా నీరు లేక రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. నీటిసమస్యను పరిష్కరించేందుకు జీవీఎంసీ డయల్‌యువర్‌ ట్యాంకర్‌ పేరుతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసింది. ఇందుకోసం కేటాయించిన ఫోన్‌నంబర్లు పనిచేయడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపలేదు. దీనివల్ల సీజన్‌లో సగానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఒట్టిపోయాయి. దీంతో కొళాయి నీటిసరఫరా గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బోర్లు ఒట్టిపోవడంతో రోజువారీ అవసరాలకు కూడా నీరులేక అల్లాడిపోతున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌కమ్యూనిటీల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఈ తరుణంలో ప్రజలు తమ అవసరాలకు జీవీఎంసీ ట్యాంకర్ల వైపు క్యూకట్టడంతో వాటికి డిమాండ్‌ పెరిగిపోయింది. డిమాండ్‌కు సరిపడా ట్యాంకర్లను సరఫరా చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు భారీగా వసూలుచేస్తుండడంతో ప్రజల జేబులకు చిల్లుపడుతోంది.

నగరంలో నీటి కోసం ప్రజల అగచాట్లను చూసిన జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జీవీఎంసీ నుంచి ట్యాంకర్ల సరఫరాకు డయల్‌యువర్‌ ట్యాంకర్‌ పేరుతో గతనెలలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. టీఎస్‌ఆర్‌కాంప్లెక్స్‌లో నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించారు. ట్యాంకర్‌ కావాల్సిన వారు టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు లేదా సమీపంలోని పంప్‌హౌస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా హెల్ప్‌డెస్క్‌కు ఫోన్‌చేస్తే ప్రాధాన్యతవారీగా ట్యాంకర్లను పంపిస్తామని ప్రకటించారు. ట్యాంకర్‌ కోసం 180043500009 టోల్‌ఫ్రీ నంబర్‌తోపాటు జీవీఎంసీ వెబ్‌సైట్‌ లేదా వాట్సాప్‌ద్వారా ట్యాంకర్లను బుక్‌చేసుకునేలా 9014218870, 8187897569, 7386001360 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. డయల్‌యువర్‌ట్యాంకర్‌కు ఫోన్‌ చేసిన వారికి ట్యాంకర్‌ను సరఫరాచేసేందుకు నగర పరిధిలోని 12 ఫిల్లింగ్‌పాయింట్ల నుంచి 102 ట్యాంకర్లతో ప్రతి రోజూ సగటున 400 ట్రిప్పులు నీటిని అందిస్తామని ప్రకటించారు. అయితే పోలవరం ఎడమకాలువ నీటిని నగరానికి తీసుకువచ్చే క్రమంలో ఏలేరు కాలువ ద్వారా వస్తున్న నీటిని నిలిపేశారు. పోలవరం కాలువ నుంచి వచ్చేనీరు నగర అవసరాలకు ఏమాత్రం సరిపోకపోవడంతో ట్యాంకర్లతో నీటిసరఫరాకు ఆటంకం ఏర్పడింది. ట్యాంకర్ల కోసం ఫోన్‌చేసేవారు ఎక్కువవడం, వారికి ట్యాంకర్‌తో నీటిని సరఫరాచేసే పరిస్థితి లేకపోవడంతో హెల్ప్‌డెస్క్‌లోని ఫోన్‌నంబర్లు పనిచేయడం మానేశాయి. దీంతో ట్యాంకర్‌ కోసం ప్రజలు తిరిగి ప్రైవేటు నిర్వాహకులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో భూగర్భజలాలు కొన్నిప్రాంతాల్లో మెరుగుపడినప్పటికీ ప్రజల అవసరాలను తీర్చేస్థాయిలో బోర్ల నుంచి నీరు రావడం లేదు. దీంతో ఇప్పటికీ ప్రజలు ట్యాంకర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి డయల్‌ యువర్‌ ట్యాంకర్‌ హెల్ప్‌డెస్క్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఆర్‌సీడీలో పీడియాట్రిక్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి?

ఆరేళ్ల కిందటి ప్రతిపాదనలకు కదలిక

అప్పట్లో రూ.197 కోట్లతో డీపీఆర్‌ తయారీ

జిల్లా ఇన్‌చార్జి, ఆరోగ్యశాఖా మంత్రులకు ప్రతిపాదిత ఫైల్‌

ఏర్పాటుకు అవకాశాలపై నివేదిక కోరిన డీఎంఈ

కార్యరూపం దాలిస్తే మెరుగైన సేవలకు వీలు

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

చిన్నారులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందిం చేందుకు వీలుగా పెదవాల్తేరులోని రాణీ చంద్రమణీ దేవి ఆస్పత్రిలో పీడియాట్రిక్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు ప్రతిపాదనకు కదలిక వచ్చింది. ఆరేళ్లక్రితం ఆస్పత్రి అభివృద్ధికి అవకాశాలు, ఈప్రాంత అవసరాలు, భవన నిర్మాణాలకు స్థలం, ఇతర అంశాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రాష్ట్రంలో చిన్నారుల కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి లేకపోవడంతో ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, డీపీఆర్‌తయారీకి ఆదేశించింది.

దీంతో అప్పటి ఆర్‌సీడీ ఆస్పత్రి అధికారులు, జిల్లా యంత్రాంగం డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇదే తరహాలో మరో రెండుచోట్ల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆరేళ్లు కావస్తున్నా ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో కేజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ చక్రవర్తి, ఇతర అధికారులు మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఫైల్‌ను ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు అందించారు. దీంతో ఆస్పత్రి ఏర్పాటుకు గల అవకాశాలపై నివేదిక పంపాలని డీఎంఈ కార్యాలయం కోరింది.

చిన్నారులకు అడ్వాన్స్‌డ్‌ వైద్య సేవలు..

ప్రస్తుతం ఇక్కడ కొన్నిరకాల చిన్నారుల సమస్యలకు వైద్యసేవలు అందిస్తున్నారు. పీడియాట్రిక్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు రూ.197 కోట్లతో అప్పట్లో ప్రతిపాదనలు రూపొందించారు. ఇది మరింత పెరిగే అవ కాశముంది. ప్రస్తుతం ఆస్పత్రి సుమారు 29 ఎకరాల విస్తీ ర్ణంలో ఉండగా, 70 పడకలతో సేవలుందిస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే నాలుగు సర్జికల్‌, ఆరు మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ విభాగాలతోపాటు జనరల్‌ పీడియాట్రిక్స్‌, ఆర్థోపీడియాట్రిక్‌ సేవలందించేం దుకు అవకాశం ఉంటుంది. అభివృద్ధిలో భాగంగా సుమా రు 500 పడకలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితే పీడియాట్రిక్‌ న్యూరో, సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఫిజియోథెరఫీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ర్టో ఎం ట్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ వంటి అధునాతన విభాగాలు అందుబాటులోకి వస్తాయి. వాటిలో ఒక్కో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ సీట్లు వస్తాయి. దీనివల్ల తీవ్రమైన సమస్యలతో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు వీలుంటుంది. ప్రభుత్వ పెద్దలు దృష్టిసారిస్తే నీలోఫర్‌ స్థాయి వైద్య సేవలు అందించే అవ కాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


నిఘా నీడన పాఠశాలలు

సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్‌ చర్యలు

త్వరలో జిల్లాలోని 593 ప్రభుత్వ పాఠశాలల్లో అమరిక

రూ.5 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో కొనుగోలు

విశాఖపట్నం, సెప్టెంబరు (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిఘా పెంచనున్నారు. పాఠశాల ఆవరణలో భద్రత, మధ్యాహ్నభోజనం అమలు, పాఠశాల సమయంలో ఇతరుల ప్రవేశం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమయపాలన, పాఠశాల్లో వ్యాయామ తరగతుల నిర్వహణ, ఆస్తులకు భద్రత, రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్టవేసేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు.

జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద 593 పాఠశాలలు ఉన్నాయి. నగరం, పరిసరాల్లోనే ఎక్కువ పాఠశాలలు ఉన్నందున అల్లరిమూకలు, అసాంఘిక కార్యకాలాపాలకు విద్యార్థులను దూరంగా ఉంచేందుకు సీసీ కెమెరాలు సహకరిస్తాయి. నగరంలో కొన్నిచోట్ల పాఠశాలలకు సమీపంలో గంజాయి బ్యాచ్‌లు తిరుగుతున్నాయనే ఫిర్యాదులున్నాయి. ప్రధానోపాధ్యాయుడి నుంచి క్లాస్‌ టీచర్‌ వరకు ఎంత శ్రద్ధపెట్టినా ఒక్కోసారి విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారనే వాదన ఉంది. కొన్నిచోట్ల టీచర్లు ఉదయం బయోమెట్రిక్‌ వేసి సొంత పనుల కోసం బయటకు వెళుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటికి తెరపడాలంటే పాఠశాలలపై నిఘా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ప్రాథమిక పాఠశాలల్లో మూడు, యూపీ పాఠశాలల్లో ఐదు, ఉన్నత పాఠశాలల్లో ఎనిమిది చొప్పున కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. చంద్రంపాలెం, తోటగరువు, గాజువాక, గోపాలపట్నం, నడుపూరు, అగనంపూడి, పెందుర్తి, ఆనందపురం వంటి పెద్ద పాఠశాలల్లో ఎనిమిది కంటే ఎక్కువగా అమర్చుతారు. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు ఇటీవల దివీస్‌ యాజమాన్యం క్రీడామైదానం, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసింది. వాటి రక్షణ, ఇతర అంశాలు కచ్చితంగా తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు అవసరమని భావించారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లాలో ఏసీలు, ఇతర యంత్రాలు తయారుచేసే సంస్థ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధుల్లో భాగంగా రూ.5 కోట్లతో సీసీ కెమెరాలు సమకూర్చనుంది.

Updated Date - Sep 21 , 2026 | 12:48 AM