Share News

పెనుగాలులు, చిరుజల్లులు...

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:11 AM

తీవ్ర తుఫాన్‌ ‘అక్వాన్‌’ ప్రభావంతో నగరంలో గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది.

పెనుగాలులు, చిరుజల్లులు...

నగరంపై తుఫాన్‌ ప్రభావం

అలల తాకిడికి కోతకు గురవుతున్న తీరం

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

తీవ్ర తుఫాన్‌ ‘అక్వాన్‌’ ప్రభావంతో నగరంలో గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. అడపాదడపా జల్లులు కురిశాయి. అయితే గాలులు మాత్రం బలంగా వీచాయి. రాత్రి వరకు ఇదే మాదిరి వాతావరణం నెలకొంది.

తుఫాన్‌ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలకు కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం వద్ద తీరం కోతకు గురైంది. అదేవిధంగా నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా పిల్లల పార్క్‌ వద్ద కూడా తీరం కోరుకుపోయింది. అధికారులు భద్రత కోసం కొన్ని ఇసుక బస్తాలు వేశారు. ఈ నేపథ్యంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి తరువాత సముద్రంలో కొనసాగుతున్న తుఫాన్‌ విశాఖకు తూర్పుముఖంగా రానున్నది. అప్పటి నుంచి నగరంలో గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. గాలులతోపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు గాలుల తీవ్రత కొనసాగి ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతుందన్నారు.


విశాఖ సెంట్రల్‌ జీఎస్‌టీ కమిషనర్‌గా శ్రీదేవి

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం సెంట్రల్‌ జీఎస్‌టీ కమిషనరేట్‌లో నూతన కమిషనర్‌గా శ్రీదేవి తరిట్ల బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా గుంటూరు సెంట్రల్‌ జీఎస్‌టీ ఆడిట్‌ కమిషనర్‌గా దాసరి బాలయ్య బాధ్యతలు తీసుకున్నారు.


అమ్మవారి దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో...

కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

డిసెంబరు 9 నుంచి జనవరి 7 వరకు ఉత్సవాలు

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

మార్గశిర మాసోత్సవాల్లో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి టికెట్లు ఈసారి ఆన్‌లైన్‌లో ముందుగానే విక్రయించాలని జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి సూచించారు. దీనిపై ఇప్పటి నుంచే విస్తృత ప్రచారం కల్పించాలని దేవస్థానం అధికారులకు సూచించారు. డిసెంబరు 9 నుంచి జనవరి 7వ తేదీ వరకు నిర్వహించే మార్గశిర ఉత్సవాలపై కలెక్టర్‌ కార్యాలయంలో దేవస్థానం, పోలీస్‌, వివిధ శాఖాధికారులతో ఆమె గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ సంఖ్యను దృష్టిలో ఉంచుకొని గురువారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈసారి ఐదు గురువారాలు వచ్చాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధర్మ దర్శనం (ఉచితం), రూ.200 (వీఐపీ), రూ.500 ప్రత్యేక దర్శనాల క్యూలైన్లతో పాటు ప్రొటోకాల్‌ దర్శనాలకు వేర్వేరు స్లాట్లు, మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త రోడ్డు జంక్షన్‌, ఘోషాసుపత్రి, జగన్నాథ స్వామి ఆలయం పరిసరాల్లో రద్దీ నియంత్రణకు పటిష్టమైన బారికేడింగ్‌ ఉండాలన్నారు. దర్శనం అనంతరం భక్తులు బురుజుపేట మార్గంలో బయటకు వెళ్లేలా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో అందరికీ అర్థమయ్యేలా సూచికల బోర్డులు, నిరంతరం మైకు ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేయాలన్నారు. పారిశుధ్యలోపం తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శన సమయాలపై భక్తులకు నిరంతరం సమాచారం అందేలా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌ మళ్లింపుపై ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈఓ శోభారాణి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 01:11 AM