Share News

మన్యంలో జోరుగా జలధార

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:11 PM

నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుతోపాటు భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జలధార- జలహారతి’ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో 5,196 నీటి సంరక్షణ పనులకు గానూ రూ.302.45 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 2,781 పనులు పూర్తికాగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

మన్యంలో జోరుగా జలధార
డుంబ్రిగుడ మండలం సంతవలసలో నిర్మించిన పంటకుంట

రూ.302 కోట్లతో 5,196 జల సంరక్షణ పనులు

ఇప్పటికే 2,781 పనులు పూర్తి

వివిధ దశల్లో మిగిలిన పనులు

నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు,

సాగునీటి సదుపాయాల కల్పనే లక్ష్యం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జలధార-జలహారతిలో నీటి సంరక్షించడంతోపాటు వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండేలా సాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఏజెన్సీలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. చెరువులు, పంట కుంటలు, పంట కాల్వలు, సాగు నీటి వనరులైన చెక్‌డ్యామ్‌లు, వాటి చానళ్లు బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార-జలహారతి కార్యక్రమాన్ని చేపడుతున్నది. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నీటి సంరక్షణకు అవసరమైన పనులను గుర్తించి, వాటిని చేపట్టడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉన్నారు. నీటి సంరక్షణలో భాగంగా చెరువుల్లో, కాలువల్లో పూడికతీత, చెరువు గట్లు బలోపేతం, పంట కుంటలు, చెక్‌డ్యామ్‌ల్లోని పూడికతీతతోపాటు చానళ్లల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే కొండవాలుగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణతోపాటు భూసార సంరక్షణకు గానూ కందకాలు తవ్వించారు.

జోరుగా సాగుతున్న పనులు

ఏజెన్సీలోఉపాధి హామీ పథకం ద్వారా జలధార- జలహారతిలో భాగంగా చేపడుతున్న పనులు జోరుగా సాగుతుండడం విశేషం. జిల్లా కలెక్టర్‌ నిషాంతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ డాక్టర్‌ విద్యాసాగరరావు ఎప్పుటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలతో పనులు జోరందకుంటున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 5,196 పనులు మంజూరు కాగా ఏప్రిల్‌ రెండో వారంలో పనులు ప్రారంభించారు. దాదాపుగా 50 రోజుల్లోనే 2,781 పనులు పూర్తయ్యాయి. దీంతో జలధార-జలహారతి పనుల్లో మిగిలిన జిల్లాల కంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ముందంజలో ఉందని అధికారులు అంటున్నారు. మిగిలిన పనులు సైతం ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ నాటికి పూర్తవుతాయని అంటున్నారు.

జిల్లాలో జలధార- జలహారతి పనుల వివరాలు.....

------------------------------------------------------------

వ.సం మండలం మంజూరైన పనులు మంజూరైన నిధులు(రూ.కోట్లలో)

-----------------------------------------------------------------------------------

1. జీకేవీధి 665 37.51

2. ముంచంగిపుట్టు 284 18.01

3. పాడేరు 899 34.86

4. హుకుంపేట 359 25.99

5. జి.మాడుగుల 577 31.88

6. అనంతగిరి 383 31.08

7. పెదబయలు 281 18.42

8. కొయ్యూరు 501 25.32

9. చింతపల్లి 330 14.70

10. అరకులోయ 504 32.81

11. డుంబ్రిగుడ 413 31.88

-----------------------------------------------------------------------------------

మొత్తం 5,196 302.45

-----------------------------------------------------------------------------------

Updated Date - Jun 13 , 2026 | 10:11 PM