Share News

పవర్‌ఫుల్‌ డిమాండ్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:06 AM

ఎండలు మండిపోతున్నాయి. ఒకటే ఉక్కపోత. మే నెల వాతావరణం గుర్తుకు వస్తోంది.

పవర్‌ఫుల్‌ డిమాండ్‌

వేసవిని తలపిస్తున్న ఎండలు

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

గత ఏడాదితో పోల్చితే రోజుకు 2.271 మి.యూ. అధికం

ఈ నెల 2న అత్యధికంగా 20.136 మి.యూ. వాడకం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎండలు మండిపోతున్నాయి. ఒకటే ఉక్కపోత. మే నెల వాతావరణం గుర్తుకు వస్తోంది. ఎల్‌నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రుతుపవనాల సీజన్‌ అయినా వర్షాలు పడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు కూడా సహకరించడం లేదు. రాత్రి తొమ్మిది గంటలైనా వాతావారణం చల్లబడడం లేదు. దాంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. మండు వేసవిలో ఎలా ఉపయోగిస్తారో అలా విద్యుత్‌ను వాడేస్తున్నారు. ఏసీలు ఉపయోగించే గృహ వినియోగదారుల బిల్లులు రూ.2 వేలు దాటే వస్తున్నాయి. రెండు ఏసీలు ఉపయోగించేవారికైతే రూ.3 వేలు బిల్లు వస్తోంది.

గత ఏడాది ఆగస్టు నెలలో విశాఖపట్నం సర్కిల్‌ వినియోగదారులు 502 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ ఏడాది ఆగస్టు నెల చూసుకుంటే 579.769 మిలియన్‌ యూనిట్లు వాడినట్టు రికార్డులు చూపిస్తున్నాయి. అంటే 77.769 మిలియన్‌ యూనిట్లు అధికం.

ఇక గత ఏడాది సెప్టెంబరు ఆరో తేదీన చూస్తే 16.364 మిలియన్‌ యూనిట్ల వినియోగం నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరు ఆరో తేదీ (ఆదివారం)న వినియోగం 18.635 మిలియన్‌ యూనిట్లుగా రికార్డు అయింది. అంటే 2.271 మిలియన్‌ యూనిట్లు అధికం.

సెప్టెంబరులో వినియోగం ఇలా...

విశాఖ సర్కిల్‌లో మూడు జోన్లు ఉన్నాయి. జోన్‌-1లో ఆశీల్‌మెట్ట, మద్దిలపాలెం, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, దొండపర్తి, అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, సిరిపురం ప్రాంతాలు ఉన్నాయి. జోన్‌-2లో కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్‌ఎస్‌టీఎల్‌, మురళీనగర్‌, ఆటోనగర్‌, వడ్లపూడి, కూర్మన్నపాలెం, గాజువాక, చినగంట్యాడ, మింది, పెదగంట్యాడ, శ్రీహరిపురం ప్రాంతాలు ఉండగా, ఎండాడ, సాగర్‌నగర్‌, మధురవాడ, కొమ్మాది, విశాలాక్షినగర్‌, భీమిలి, గోపాలపట్నం, ఆరిలో, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలు జోన్‌-3లోను ఉన్నాయి. ఈ జోన్ల వారీగా విద్యుత్‌ వినియోగం మిలియన్‌ యూనిట్లలో ఇలా ఉంది.

------------------------------------------------------------------------------------

తేదీ జోన్‌-1 జోన్‌-2 జోన్‌-3 సర్కిల్‌ మొత్తం

------------------------------------------------------------------------------

సెప్టెంబరు 1 3.129 10.665 5.057 18.851

సెప్టెంబరు 2 3.283 11.438 5.415 20.136

సెప్టెంబరు 3 3.305 11.030 5.402 19.737

సెప్టెంబరు 4 3.253 10.474 5.357 19.084

సెప్టెంబరు 5 3.157 10.287 5.317 18.761

సెప్టెంబరు 5 3.132 10.291 5.212 18.635

------------------------------------------------------------------------------

ఈ నెలలో అత్యధికంగా సెప్టెంబరు 2వ తేదీన 20.136 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు.

Updated Date - Sep 08 , 2026 | 01:06 AM