ఐఎఫ్‌ఆర్‌కు పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:19 AM
అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలాన్, అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ సూచించారు. నేవీ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోస్ట్‌గార్డు డీఐజీ రాజేష్ మిత్తల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు ఇతర అధికారులు సమీక్షలో భాగస్వామ్యులయ్యారు.
భద్రత, ట్రాఫిక్, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వండి
ఉన్నత స్థాయి సమీక్షలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్
17న రాష్ట్రపతి రాక
18న ఫ్లీట్ రివ్యూ
19న మిలాన్ ప్రారంభం, సాయంత్ర సిటీ పరేడ్
సిరిపురం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2026), మిలాన్, అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ సూచించారు. నేవీ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో బుధవారం ఆయన కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోస్ట్‌గార్డు డీఐజీ రాజేష్ మిత్తల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు ఇతర అధికారులు సమీక్షలో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి, రక్షణ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతో పాటు రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సేవల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17న రాష్ట్రపతి రాకతో కార్యక్రమాలు మొదలవుతాయన్నారు. 18న ఫ్లీట్ రివ్యూ, 19వ తేదీ ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటాయన్నారు. సిటీ పరేడ్ మార్గంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు, పీఏ సిస్టమ్, గ్యాలరీలు, బారికేడ్ల ఏర్పాటు, పార్కింగ్ ప్రాంతాలపై ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వీఎంఆర్డీఏ పార్కు, వైఎంసీఏ, ఏయూ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లను హోల్డింగ్ ఏరియాలుగా వినియోగించుకోవాలన్నారు. బీచ్ రోడ్డు సుందరీకరణ, డెకరేటివ్ లైటింగ్, పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 17 నుంచి కంట్రోల్‌రూమ్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, అవసరమైతే వేదికల వద్ద కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: సీపీ శంఖబ్రత బాగ్జి
ప్రజా భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు ఏర్పాటుచేసి కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ మానటరింగ్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ అన్నారు. నో-డ్రోన్, నో కైట్ జోన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో, ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.