Share News

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:07 PM

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు.

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిషాంతి

పాడేరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. కౌంటింగ్‌ సన్నద్ధతపై కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 617 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 4,98,465 మంది ఓటర్లకుగానూ 3,09,133 మంది ఓటు హక్కులను వినియోగించుకున్నారని తెలిపారు. ఆయా ఓట్ల లెక్కింపునకు ప్రతి మండలంలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఎన్నికల కోడ్‌ మేరకు అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలోనూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటి లైవ్‌ ఫుటేజ్‌లను సైతం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో వీక్షించవచ్చునన్నారు. గురువారం జిల్లాలో పరిషత్‌ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విలేకర్ల సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌, జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:07 PM