మలేరియా రహిత సమాజానికి కృషి
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:09 PM
మలేరియా రహిత సమాజ స్థాపనకు అందరూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ టి.నిశాంతి పిలుపు
పాడేరులో ఉత్సాహంగా అవగాహన ర్యాలీ
ఉద్యోగులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ
పాడేరు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి):
మలేరియా రహిత సమాజ స్థాపనకు అందరూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి పిలుపునిచ్చారు. జాతీయ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రధానంగా మలేరియా కారక దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దోమల బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దోమల తెరలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా చేసే స్ర్పేయింగ్ సైతం చేయించుకోవాలన్నారు. మలేరియా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని, దోమల నివారణ, జాగ్రత్తలు పాటించడం ముఖ్యమన్నారు. ర్యాలీ అనంతరం అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు మలేరియా నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా మలేరియా అధికారి తులసి, డీఆర్‌వో ఎంవీఎస్.లోకేశ్వరరావు, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.