డీజిల్, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:46 PM
డీజిల్, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ హెచ్చరించారు.
కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ హెచ్చరిక
జిల్లాలోని 22 బంకుల తనిఖీలకు ట్రాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
సమస్యలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్: 08935-293448
పాడేరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): డీజిల్, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ హెచ్చరించారు. పాడేరులోని బంకుల్లో తాజా పరిస్థితులను పరిశీలించేందుకు సోమవారం కలెక్టర్, ఎస్‌పీ పలు బంకులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే, అందుకు బాఽధ్యులపై చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని, ఈ విషయంలో వినియోగదారులు, వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే బంకుల యజమానులు వినియోగదారులకు సహకరించాలని సూచించారు. బంకుల్లో కేవలం వాహనాలకు మాత్రమే చమురు వేయాలని, విడిగా క్యాన్లలో పోయకూడదని ఆదేశించారు.
బంకుల తనిఖీలకు ట్రాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
డీజిల్, పెట్రోల్ కృతిమ కొరత సృష్టించకుండా జిల్లాలోని 22 బంకులను తనిఖీలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ టి.నిషాంతి, ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు. రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖల అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలు బంకుల్లో తనిఖీలు చేపడతాయన్నారు. ఈ క్రమంలో ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు చేపడతామని వారు హెచ్చరించారు. అలాగే ఆయా శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామని, డీజిల్, పెట్రోల్ కొరతకు సంబంధించిన సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్: 08935-293448కు కాల్ చేయాలని సూచించారు. బంకుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల్లోనూ పరశీలిస్తామని, ప్రస్తుతానికి జిల్లాలో డీజిల్, పెట్రోల్ సమస్యలు లేవని కలెక్టర్, ఎస్‌పీ తెలిపారు. పెట్రోల్, డీజిల్ లూజుగా విక్రయిస్తే బంకు యజమానులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్, ఎస్‌పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మోహనరావు, సీఐ డి.దీనబందు, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.