ఒకే మార్గంలో రోడ్డు, రైల్వే ట్రాక్!
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:19 AM
వంద అడుగుల ప్రతిపాదిత రోడ్డులో రైల్వే ట్రాక్ నిర్మాణం సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యం కాదని ఆర్‌అండ్‌బీ అధికారులు అంటుతున్నారు. ఈ సమస్య రామన్నపాలెం- పయనీర్ కంపెనీల (గతంలో అన్‌రాక్) మధ్య ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
రామన్నపాలెం- పెదపల్లి రహదారి నిర్మాణంలో కొత్త చిక్కు
వంద అడుగుల వెడల్పుతో చేపట్టడానికి సర్వే
మరోవైపు పయనీర్ కంపెనీకి బయ్యవరం నుంచి రైల్వే ట్రాక్ నిర్మాణం
మూడు కిలోమీటర్ల మేర రోడ్డు, రైల్వే ట్రాక్ కలయిక
రోడ్డు వెడల్పు తగ్గిస్తారా? రైల్వే ట్రాక్ అలైన్‌మెంట్ మారుస్తారా?
మాకవరపాలెం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): వంద అడుగుల ప్రతిపాదిత రోడ్డులో రైల్వే ట్రాక్ నిర్మాణం సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యం కాదని ఆర్‌అండ్‌బీ అధికారులు అంటుతున్నారు. ఈ సమస్య రామన్నపాలెం- పయనీర్ కంపెనీల (గతంలో అన్‌రాక్) మధ్య ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..
మాకవరపాలెం మండలంలో ప్రభుత్వ భూములు అందుబాటులో వుండడంతో ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు భూములు కేటాయించగా, మరికొన్ని పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నాయి. కాగా పరిశ్రమలకు రవాణా సదుపాయం, జాతీయ రహదారితో అనుసంధానం కోసం మండలంలోని రామన్నపాలెం సెంటర్ నుంచి జాతీయ రహదారిపై ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లి వరకు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారి పనుల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. కొద్ది రోజుల నుంచి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే ఇదే రోడ్డులో సుమారు మూడు కిలోమీటర్ల మేర రాచపల్లిలో ఉన్న పయనీర్ కంపెనీ రైల్వేట్రాక్ నిర్మాణం చేపట్టనున్నది. ఈ మేరకు రెండేళ్ల కిందటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది, సరిహద్దు రాళ్లు వేశారు. కంపెనీ అవసరాల కోసం కశింకోట మండలం బయ్యవరం రైల్వే స్టేటషన్ వద్ద నుంచి ఏలేరు కాలువ గట్టు మీదుగా కంపెనీ వరకు 27 కిలోమీటర్ల పొడవున కొత్తగా రైల్వే ట్రాక్ నిర్మాణానికి అన్ని అనుమతులు పొందింది. ఒకటి, రెండు నెలల్లో పనులు మొదలవుతాయని యాజమాన్యం చెబుతున్నది. అయితే బయ్యవరం నుంచి పయనీర్ కంపెనీ వరకు నిర్మించే రైల్వే ట్రాక్ సుమారు మూడు కిలోమీటర్ల మేర రామన్నపాలెం సెంటర్ నుంచి ఎలమంచిలి మునిసిపాలిటీ పెదపల్లి వరకు నిర్మించే వంద అడుగుల రహదారిలో వుండడం గమనార్హం. ప్రస్తుతం వున్న 40 అడుగుల రహదారి పక్కన రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం సరిహద్దు రాళ్లు పాతారు. ఇప్పుడు రహదారిని 100 అడుగులకు విస్తరించనుండడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ మూడు కిలోమీటర్ల పరిధిలో రెండు కిలోమీటర్ల మేర పయనీర్ కంపెనీ సేకరించిన భూమి వుంది. మిగిలిన ఒక కిలోమీటరు పరిధిలో ప్రైవేటు భూములు వున్నాయి. ఈ మూడు కిలోమీటర్ల పరిధిలో రహదారి వెడల్పును తగ్గిస్తారా? లేకపోతే రెండోవైపున పెంచుతారా? ఈ రెండూ కాకపోతే రైల్వే ట్రాక్ అలైన్‌మెంట్‌ను మారుస్తారా? అన్నది అధికారులు తెల్చాల్సి వుంది.