పండగల్లో జూదాలు ఆడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:52 PM
సంక్రాంతి పండగల సందర్భంగా గిరిజన గ్రామాల్లో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు.
ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా
చింతపల్లి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగల సందర్భంగా గిరిజన గ్రామాల్లో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంక్రాంతి పండగ మూడు రోజులు గ్రామాల్లో కోడిపందేలు, పేకాటలు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. గ్రామ దేవతల జాతరలు, పండగల్లో జూదాలు నిర్వహించరాదని ఇప్పటికే ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారన్నారు. ఎక్కడైన కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడితే కేసులు పెడతామన్నారు. గ్రామాల్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పండగ సమయంలో ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాలు నడిపే వ్యక్తులకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, హెల్మెంట్ ధరించాలన్నారు. సర్వీసు వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులతో నడపరాదన్నారు. గిరిజన యువత గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలన్నారు. ఏజెన్సీలో ప్రస్తుతం గంజాయి సాగు కట్టడి చేశామన్నారు. ఒడిశా నుంచి గిరిజన ప్రాంతాల మీదుగా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఈ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. విలేకర్ల సమావేశంలో సీఐ ఎం. వినోద్‌బాబు, ఎస్‌ఐలు జి. వీరబాబు, సాయిరామ్, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.