చట్టవ్యతిరేక వ్యాఖ్యలపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:07 PM
జీవో నంబరు 3 పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌పై గిరిజనులు శుక్రవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆందోళనలో చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్ శనివారం పోలీసులను ఆదేశించారు.
జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్
కలెక్టరేట్‌ను బద్దలు గొడతాం..
ప్రభుత్వ ఆస్తులను కాల్చివేస్తామంటే కేసులే..
పాడేరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జీవో నంబరు 3 పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌పై గిరిజనులు శుక్రవారం జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆందోళనలో చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్ శనివారం పోలీసులను ఆదేశించారు. ఈమేరకు ఎస్‌పీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల ఆందోళనలో భాగంగా ఐటీడీఏ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలువురు వక్తలు చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కలెక్టరేట్‌ను బద్దలుగొడతాం.. ప్రభుత్వ ఆస్తులను కాల్చివేస్తాం వంటి చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని, ఆయా చట్టవ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారని, విచారణ అనంతరం వారిపై చర్యలు చేపడతామని ఎస్‌పీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, అయితే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌పీ అమిత్‌బర్దార్ హెచ్చరించారు.