Share News

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:11 AM

పౌర సేవల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడితే అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఆర్‌వో అంబేడ్కర్‌, ఆర్‌డీవో లోకేశ్వరరావు

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోం

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

పీజీఆర్‌ఎస్‌లో వినతులపై అలసత్వం వద్దని హితవు

పాడేరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పౌర సేవల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడితే అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లాలోని ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిపాలన మరింత పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సేవలందించడంలో వేగం పుంజుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, వైద్యసేవలు అందించడం, ప్రజలకు ఇతర సేవలందించే క్రమంలో ఎవరైనా లంచాలు డిమాండ్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజల నుంచి అధికారులు, సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే అధికారిక వ్యవహారాల్లో ఈ-ఫైలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు సకాలంలో జరపాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన ఫైళ్లు, ఇతర నివేదికలను సకాలంలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. భూముల రీసర్వే జరిగిన ప్రాంతాల్లో పాసు పుస్తకాలను పక్కాగా పరిశీలించి, తప్పులు లేకుండా లబ్ధిదారులకు వాటిని అందించాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై స్పందన స్వీకరించాలన్నారు. జిల్లాలో డివిజన్‌, మండల స్థాయిల్లో సైతం పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌కు సంబంధించిన నివేదికలను ప్రతి నెలా తొమ్మిదిన తమకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, డీఆర్‌వో పి.అంబేడ్కర్‌, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:11 AM