ఫిన్లాండ్‌లో ఒత్తిడి లేని విద్య
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:58 AM
ఫిన్లాండ్‌లో జాయ్‌ఫుల్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా ఒత్తిడి లేని విద్య అందిస్తున్నారని అక్కడ శిక్షణ పొంది శనివారం జిల్లాకు చేరుకున్న రోలుగుంట జడ్పీ పాఠశాల ఉపాధ్యాయిని నాగజ్యోతి తెలిపారు.
- అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు
- తమ అనుభవాలను పంచుకున్న రోలుగుంట జడ్పీ పాఠశాల ఉపాధ్యాయిని నాగజ్యోతి
రోలుగుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్‌లో జాయ్‌ఫుల్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా ఒత్తిడి లేని విద్య అందిస్తున్నారని అక్కడ శిక్షణ పొంది శనివారం జిల్లాకు చేరుకున్న రోలుగుంట జడ్పీ పాఠశాల ఉపాధ్యాయిని నాగజ్యోతి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 31 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. అక్కడ ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు శిక్షణ పూర్తి చేసుకుని వారంతా స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో అనకాపల్లి జిల్లాకు చెందిన రోలుగుంట జడ్పీ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఏం నాగజ్యోతి, నర్సీపట్నానికి చెందిన డీజీ నాథ్, కె.కోటపాడుకు చెందిన లెక్కల వెంకట నారాయణరావు ఉన్నారు. జిల్లాకు చేరుకున్న ఉపాధ్యాయిని పీవీఏం నాగజ్యోతి అక్కడి అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందిన దేశం ఫిన్లాండ్ అని, కేవలం పాఠ్యాంశాల బోధనకే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించడం అక్కడ ప్రత్యేకతని పేర్కొన్నారు. విద్యార్థి అభ్యాసనం, అనుభవాత్మక విద్య, ఆనందాయక అభ్యాసనం, స్వతంత్ర ఆలోచన, ఉపాధ్యాయుల పాత్ర, ఆచరణాత్మక బోధన వంటి అంశాలను ప్రత్యేక్షంగా అధ్యయనం చేసినట్టు తెలిపారు. ఫిన్లాండ్ విద్యావిధానంలోని ఉత్తమ పద్ధతులను భారతీయ పాఠశాలల పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించి నేర్చుకున్నట్టు చెప్పారు. అక్కడ విద్యార్ధులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆచరణాత్మక అభ్యాసానికే ప్రాధాన్యం ఇస్తారన్నారు. తక్కువ బోధన, ఎక్కువ పరిశీలన అనే సూత్రాన్ని అక్కడ పాటిస్తున్నారని ఆమె తెలిపారు. అక్కడ సమాజంలో ఉపాధ్యాయుడికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. విద్యార్థులకు పరీక్షల భయం లేని విద్యా విధానం అమలవుతోందని, జాయ్‌ఫుల్ లెర్నింగ్ ద్వారా ఆనందంగా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరును పరిశీలించినట్టు తెలిపారు. ఫిన్లాండ్‌లో పాఠ్యప్రణాళిక ఎంతో సరళంగా, జీవన నైపుణ్యాలను పెంపొందించే విధంగా రూపొందించారని ఆమె చెప్పారు. ఫిన్లాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా టుర్కు యూనివర్సిటీ వైస్ డైరెక్టర్ మయా పితోలా నుంచి నాగజ్యోతి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా రోలుగుంట ఎంఈవో జాన్‌ప్రసాద్, జడ్పీ పాఠశాల హెచ్‌ఎం టీవీ శేషగిరిరావు, తదితరులు ఆమెను అభినందించారు.