వీధి దీపాలపై మల్లగుల్లాలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:28 AM
నగరంలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నిర్వహణ కోసం కాంట్రాక్టర్‌కు ప్రతి నెలా రూ.కోటి చెల్లింపు
కానీ ఎక్కడికక్కడ దీపాలు వెలగడం లేదని ఫిర్యాదులు
అరకొర సిబ్బందితోనే పనులు చేస్తున్నారని ఆరోపణలు
నోటీసులు ఇచ్చినా కాంట్రాక్టర్ నుంచి స్పందన నిల్
తిరిగి ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించేందుకు అధికారుల యోచన
త్వరలో సమస్యకు పరిష్కారం: జీవీఎంసీ కమిషనర్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిర్వహణకు ప్రతి నెలా సుమారు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నా నగరమంతటా చీకటి రాజ్యమేలుతోందని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. సమస్య పరిష్కరించాలని కాంట్రాక్టర్‌కు అధికారులు నోటీసులు జారీచేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ మార్పు, ఇతర పరిష్కార మార్గాలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో సుమారు 1.18 లక్షల వీధిదీపాలున్నాయి. విద్యుత్ వినియోగంతోపాటు ఖర్చు తగ్గించే లక్ష్యంతో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. మొదట్లో నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అనుబంధం కలిగిన ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) దక్కించుకుంది. ఆ సంస్థకు జీవీఎంసీ ఏటా రూ.18.5 కోట్ల చొప్పున చెల్లించేది. ఎనిమిదేళ్ల తర్వాత ఈఈఎస్‌ఎల్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్ దక్కించుకుంది. ఈ సంస్థకు జీవీఎంసీ ప్రతి నెలా రూ.కోటికిపైగా బిల్లు చెల్లిస్తోంది. ఈ సంస్థ ప్రతి వార్డులో టెక్నీషియన్, హెల్పర్‌తోపాటు వీధిదీపాలు ఎక్కడెక్కడ వెలగడం లేదో గుర్తించేందుకు మరొకరిని నియమించుకోవాలి. ఇలా 98 వార్డులకు 98 బృందాలను ఏర్పాటుచేసుకుని, ఎక్కడైనా వీధి దీపాలు వెలగకపోతే రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి. లేదంటే జీవీఎంసీ జరిమానా విధించాలి.
కానీ, నగరంలో కొన్నేళ్లుగా వీధిదీపాలు సరిగా వెలగడం లేదు. తమ ప్రాంతంలో రాత్రివేళ వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు కార్పొరేటర్‌లకు ఫిర్యాదుచేస్తున్నారు. దీంతో కార్పొరేటర్లు వీధిదీపాల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్ అరకొర సిబ్బందితో గడిపేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాల్లో నిలదీస్తున్నారు. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇస్తున్నామని, జరిమానా వసూలు చేస్తున్నామని అధికారులు తప్పించుకుంటున్నారు. కానీ సమస్య పరిష్కరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రత్యమ్నాయ చర్యలపై దృష్టిసారించారు.
కాంట్రాక్టర్‌ను తొలగించే యోచనలో
జీవీఎంసీ పరిధిలో వీధిదీపాల సమస్య నిత్యకృత్యంగా మారడంతో ఇప్పుడున్న కాంట్రాక్టర్‌ను తొలగించి వేరొకరికి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదు కాబట్టి, టెండరు గడువున్నప్పటికీ పూర్తిగా తొలగించి, కొత్త కాంట్రాక్టర్ కోసం టెండర్ పిలవడం ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ కొత్తకాంట్రాక్టర్ వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడేం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. దీనికోసం ఇప్పుడున్న కాంట్రాక్టర్ నుంచి సగం జోన్‌లను తొలగించి, కొత్త కాంట్రాక్టర్‌కు ఆ జోన్‌ల నిర్వహణ అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ రెండు ప్రతిపాదనలతో కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. ఈ విషయం కమిషనర్ కేతన్‌గార్గ్ వద్ద ప్రస్తావించగా, త్వరలోనే సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు. గతంలో వీధిదీపాల నిర్వహణ చేపట్టిన ఈఈఎస్‌ఎల్ తిరిగి వీధిదీపాల నిర్వహణకు ఆసక్తిచూపుతున్నందున ఆ సంస్థకు అప్పగించడంపై ఆలోచిస్తున్నామన్నారు. నగరంలో ఇప్పుడున్న వీధి దీపాలన్నింటినీ తీసేసి వాటిస్థానంలో అధికకాంతిని వెదజల్లే ఎల్‌ఈడీ లైట్లను అమర్చేలా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.