Share News

భౌ..భౌ..

ABN , Publish Date - May 18 , 2026 | 12:43 AM

నగరంలో వీధికుక్కలు విజృంభిస్తున్నాయి.

భౌ..భౌ..

హడలెత్తిస్తున్న గ్రామ సింహాలు

వృద్ధులు, చిన్నారులపై గుంపులుగా దాడి

ఏడాదికి సగటున 50 వేల మంది బాధితులు

నియంత్రణలో జీవీఎంసీ వైఫల్యం

లక్ష్యం మేర కు జరగని కు.ని శస్త్ర చికిత్సలు

అధికారిక లెక్కలపైనా అనుమానాలు

కుక్కల నియంత్రణకు ఏటా రూ.2.2 కోట్లు ఖర్చు

(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)

నగరంలో వీధికుక్కలు విజృంభిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నాయి. గుంపులుగా దాడిచేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. నగర పరిధిలో ప్రతిరోజూ ఏదో ఒక చోట వీధికుక్కల దాడి జరుగుతూనే ఉంది. పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులు, ఇంటి ముందు ఆడుకునే పిల్లలపై ఇవి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. బైక్‌మీద వెళ్లే వారిని వెంబడిస్తుండడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుక్క కనిపిస్తే చాలు నగరవాసులు హడలిపోతున్నారు.

ఈనెల 15న కూర్మన్నపాలెంలో పగటిపూట పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్కలు గుంపుగా దాడిచేసి శరీరాన్ని ఛిద్రం చేశాయి. స్థానికులు చూసి రాళ్లతో వాటిని తరిమేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. నగరంలో ఇలాంటి ఉదంతాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు కుక్కల దాడిలో ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. జనంపై వీధికుక్కల దాడులను నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. బస్టాండ్‌లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, పార్కులు, రైల్వేస్టేషన్‌లు వంటి రద్దీప్రాంతాల్లో వీధికుక్కలు లేకుండా స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పునరావాసకేంద్రానికి తరలించి యాంటీరాబిస్‌ (ఏఆర్‌వీ)వాక్సిన్‌ ఇవ్వడంతోపాటు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి, అక్కడే ఉంచాలని సూచించింది.

నగరంలో ఇవేవీ అమలుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ కాగితాలకే పరిమితమవుతోందని, వాస్తవంగా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడైనా కుక్కల దాడిలో గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా ఒకటిరెండు రోజులు హడావుడిచేస్తున్న అధికారులు ఆ తరువాత పట్టించుకోవడంలేదని నగరవాసులు విమర్శిస్తున్నారు.

నగరంలో 2.2 లక్షల వీధి కుక్కలు

జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 2.2 లక్షల వీధికుక్కలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు నాలుగుచోట్ల యానిమల్‌ బర్త్‌కంట్రోల్‌ (ఏబీసీ) సెంటర్లు నిర్వహిస్తోంది. వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునేందుకు ప్రతి జోన్‌కు ఒకటి చొప్పున పది వాహనాలను కేటాయించారు. కుక్కలను పట్టుకునేందుకు వీలుగా ఒక్కో వ్యాన్‌లో నలుగురు డాగ్‌క్యాచర్లు పనిచేస్తున్నారు. వీరు ఫిర్యాదుల ఆధారంగా ఆయాప్రాంతాలకు వెళ్లి కుక్కలను పట్టుకుని సమీపంలోని డాగ్‌షెల్టర్‌కు తరలించాలి. అక్కడ వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేస్తారు. ఆడ కుక్క అయితే ఐదు రోజులు, మగ కుక్క అయితే మూడు రోజులు ఉంచి, తర్వాత పట్టుకున్నచోటే విడిచిపెడతున్నారు. వీటిలో 90 వేల కుక్కలకు ఇప్పటివరకూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితి అనుమానం రేకెత్తిస్తోంది. 90వేల కుక్కలకు ఆపరేషన్‌ జరిగితే నాలుగేళ్ల కిందట 1.2 లక్షలున్న కుక్కల సంఖ్య ఇప్పుడు 2.2 లక్షలకు ఎలా పెరుగుతుందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

ఏటా రూ.2.2 కోట్ల ఖర్చు

నగరంలో కుక్కల నియంత్రణకు జీవీఎంసీ ఏటా సుమారు రూ.2.2 కోట్లు ఖర్చు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేసేందుకు ఆరిలోవ, నరవలో షెల్టర్లను జీవీఎంసీ, అనకాపల్లి, కాపులుప్పాడ షెల్టర్లను స్నేహ ఏజెన్సీ అనే స్వచ్ఛందసేవా సంస్థ నిర్వహిస్తోంది. ఈ నాలుగు చోట్ల గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 12,896 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, 15,557 కుక్కలకు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌లు పూర్తిచేశారు. ఒక్కో ఆపరేషన్‌కు ఎన్‌జీవోకు రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నారు. ఇవికాకుండా షెల్టర్‌లో ఉంచే కుక్కలకు ఆహారం కోసం రోజుకు రూ.45 చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఇవికాకుండా వాహనాల నిర్వహణ, డాగ్‌క్యాచర్లకు వేతనాలు, నెట్‌లు కొనుగోలు కోసం ఏటా రూ.2.2 కోట్లు జీవీఎంసీ ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ కుక్కల సంఖ్య పెరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

శస్త్రచికిత్సలపై దృష్టిపెడతాం

నగరంలో కుక్కల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. కమిషనర్‌ ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు పెంచడంపై దృష్టిపెట్టాం. నాలుగుషెల్టర్లలో ప్రస్తుతం 165 డాగ్‌కెన్నల్స్‌ ఉండగా, మరో 165 కెన్నల్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీనివల్ల కుక్కలకు ఆపరేషన్ల సంఖ్యను పెంచడానికి వీలుంటుంది. ఇప్పుడున్న షెల్టర్లకు తోడు మరిన్ని షెల్టర్ల ఏర్పాటుపై దృష్టిసారించాం. ఎగ్రసివ్‌ డాగ్‌లను గుర్తించి వాటిని పూర్తిగా షెల్టర్‌లోనే ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.

- డాక్టర్‌ ఈఎన్‌వీ నరేష్‌కుమార్‌, ప్రధాన వైద్యాధికారి, జీవీఎంసీ

నగరంలో వీధికుక్కల సంఖ్య : 2,28,000

ఏటా కుక్క కాటుకు గురవుతున్నవారి సంఖ్య: సుమారు 50 వేలు

కుక్కలకు కు.ని. శస్త్రచికిత్స చేసే కేంద్రాలు: 4

ఒక రోజులో చేయాల్సిన ఆపరేషన్ల లక్ష్యం: 3 వేలు

ప్రస్తుతం నెలకు సగటున: 1,289

పది నెలల్లో జరిగిన ఆపరేషన్లు: 12,896

ఒక్కో ఆపరేషన్‌కు వెచ్చిస్తోన్న మొత్తం. రూ.1,500

గత ఏడాది వెచ్చించిన మొత్తం రూ.2.2 కోట్లు

Updated Date - May 18 , 2026 | 12:43 AM