Share News

స్ట్రాబెర్రీ దిగుబడులు సూపర్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:18 AM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో ఈ ఏడాది స్ట్రాబెర్రీ దిగుబడి బాగా పెరిగింది. గత మూడేళ్లతో పోల్చుకుంటే ఈసారి స్ట్రాబెర్రీ దిగుబడులు రెట్టింపు వచ్చాయని రైతులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీ దిగుబడులు సూపర్‌
లంబసింగిలో స్ట్రాబెర్రీలను సేకరిస్తున్న గిరిజన మహిళలు

గత మూడేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది రెట్టింపు దిగుబడులు

లంబసింగి పరిసర ప్రాంతాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం

రైతులకు సిరుల పంట

మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్మకం

చింతపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో ఈ ఏడాది స్ట్రాబెర్రీ దిగుబడి బాగా పెరిగింది. గత మూడేళ్లతో పోల్చుకుంటే ఈసారి స్ట్రాబెర్రీ దిగుబడులు రెట్టింపు వచ్చాయని రైతులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలో వింటర్‌డాన్‌ రకం మొక్కలు మంచి దిగుబడులను ఇచ్చాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు.

ఉత్తర భారతదేశానికి పరిమితమైన అతిథి పంట స్ట్రాబెర్రీ ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో విరివిగా పండుతోంది. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పాటు మార్కెట్‌ లాభసాటిగా ఉండడంతో రైతులకు స్ట్రాబెర్రీ సిరులు కురిపిస్తోంది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. మన దేశంలో మహారాష్ట్ర మహబలేశ్వర్‌, ఊటీ, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, హరియాణ ప్రాంతాల్లో మాత్రమే స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో మాత్రమే ఇది పండుతుంది. గిరిజన రైతులు తొలి రోజుల్లో సంప్రదాయేతర పంటగా సాగును ప్రారంభించినప్పటికి ప్రస్తుతం లంబసింగిలో స్ట్రాబెర్రీ రబీ పంటల జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్నది.

సుమారు 50 ఎకరాల్లో సాగు

స్ట్రాబెర్రీ సాగుకు జిల్లాలో గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు అత్యంత అనుకూలమని 1995లో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారించారు. 2008లో చింతపల్లి మండలం లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొందిపాకలు గ్రామంలో బౌడు కుశలవుడు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో స్ట్రాబెర్రీ సాగుకు సంకల్పించారు. పుణె నుంచి మొక్కలను దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో స్ట్రాబెర్రీ సాగు చేపట్టాడు. కుశలవుడును ఆదర్శంగా తీసుకుని స్థానిక గిరిజన రైతులతో పాటు మైదాన ప్రాంతాలకు చెందిన రైతులు భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం లంబసింగి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు. ఈ ఏడాది స్ట్రాబెర్రీ దిగుబడులు భారీగా పెరిగాయి. తుఫాన్‌ల ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల పంటకు నష్టం కలగలేదు. గత మూడేళ్లతో పోల్చుకుంటే స్ట్రాబెర్రీ దిగుబడులు రెట్టింపు వచ్చాయని రైతులు చెబుతున్నారు.

హాట్‌కేకుల్లా అమ్మకం

లంబసింగిలో స్ట్రాబెర్రీలు హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. నవంబరు నుంచి లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు నుంచి అత్యధిక సంఖ్యలో దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది పర్యాటక సీజన్‌ ఆశాజనకంగా ఉంది. మైదాన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీంతో పర్యాటకులు నేరుగా స్ట్రాబెర్రీ తోటలకు వెళ్లి తాజా పండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిగుబడుల్లో 90 శాతం స్థానికంగా అమ్ముడైపోతున్నాయి. కేవలం 10 శాతం పండ్లు మాత్రమే మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. 200 గ్రాములు రూ.100 ధరకు రైతులు విక్రయిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:18 AM