ఇళ్ల నిర్మాణాల్లో చిత్ర విచిత్రాలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:09 AM
పేదలకు ఇళ్ల నిర్మాణాల పేరిట వైసీపీ హయంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
విశాఖ ఉక్కును కాదని ఛత్తీస్‌గఢ్ నుంచి స్టీల్
పది కంపెనీల నుంచి 1,90,829 టన్నుల కొనుగోలు
విశాఖ ఉక్కుకు 1,983 టన్నులకే ఆర్డర్
వైసీపీ హయాంలో హౌసింగ్ అధికారుల నిర్వాకం
విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):
పేదలకు ఇళ్ల నిర్మాణాల పేరిట వైసీపీ హయంలో చోటుచేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణిలో నేతలు, అధికారులు వ్యవహరించడంతో ఇళ్ల నిర్మాణం అవినీతిమయంగా మారి, ఇప్పటికీ పేదలకు అందని దుస్థితి నెలకొంది. ఆప్షన్-3 కింద సెంటు స్థలాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణికి చెందిన భారతి సిమెంట్స్‌కు సామర్థ్యం కంటే మూడింతల సిమెంటు కొనుగోలుకు అధికారులు ఆర్డర్లు ఇచ్చారు. అంతేకాదు జిల్లాలో నిర్మాణం చేపడుతున్న ఇళ్లకు విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి చేసే ఇనుమును కాదని హౌసింగ్ అధికారులు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి భారీగా కొనుగోలుచేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సెంటు స్థలాల్లో 3,51,436 ఇళ్ల నిర్మాణాలకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతలను వివిధ కంపెనీలకు అప్పగించింది. ఇందులో అనంతపురం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధికి చెందిన రాక్‌ట్రీ ఏజెన్సీకు 51,633 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టింది. లేఅవుట్‌ల స్వభావాన్ని బట్టి ఒక్కో ఇంటికి 350 నుంచి 400 కేజీల ఇనుమును వినియోగించాలి. దీనికి అనుగుణంగా 2021 ఏప్రిల్ నుంచి 2024 జూలై నెలాఖరు వరకు 11 కంపెనీల నుంచి హౌసింగ్ సంస్థ 1,91,812 టన్నుల ఇనుము కొనుగోలుచేసింది. ఇందుకోసం జిల్లాల వారీగా టెండర్లు పిలిచినా వైసీపీ ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు కొన్ని కంపెనీలకు ఎక్కువ ఆర్డర్లు దక్కాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేవలం 1,983 టన్నుల ఆర్డర్ మాతరమే లభించింది. ఇనుము కొనుగోలుకు రూ.221.41 కోట్లు వెచ్చించగా, విశాఖ ఉక్కుకర్మాగారానికి రూ.6.7 కోట్లు చెల్లించారు. ఎక్కువగా ఆర్డర్లు పొందిన పలు కంపెనీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవి కావడం గమనార్హం. వీటిలో శ్రీరామ స్టీల్స్ కంపెనీ నుంచి 33,237, ప్రకాష్ ఫెర్రో ఎల్లాయీస్ నుంచి 18,694 టన్నులు కొనుగోలుచేశారు. రాష్ట్రం మొత్తం మీద 3.5 లక్షల ఇళ్లలో సుమారు 80 వేల ఇళ్ల నిర్మాణాలు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే చేపట్టారు. వీటి నిర్మాణాలకు అవసరమైన ఇనుము ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన కంపెనీల నుంచి కొనుగోలుచేయడం విశేషం. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు కొనుగోలుచేయాలన్న ప్రభుత్వ నిబంధనలను హౌసింగ్ అధికారులు ఉల్లంఘించారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది. విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పదేపదే గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు, అప్పటి పాలకులు, రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల కోసం ఆ సంస్థకు ఆర్డర్లు లేకుండా చేయడం విశేషం.