Share News

‘కైలాస పరబత్‌’లో నిల్వ ఆహారం

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:04 AM

నగరంలోని లాసన్స్‌ బే కాలనీలో గల కైలాస పరబత్‌ హోటల్‌లో మంగళవారం ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిల్వ ఆహారాన్ని గుర్తించారు.

‘కైలాస పరబత్‌’లో నిల్వ ఆహారం

ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీల్లో గుర్తింపు

వేడి చేసి వినియోగదారులకు సరఫరా

సుమారు 42 కిలోలు స్వాధీనం

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని లాసన్స్‌ బే కాలనీలో గల కైలాస పరబత్‌ హోటల్‌లో మంగళవారం ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిల్వ ఆహారాన్ని గుర్తించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆహార విక్రయాలకు అనుమతులు కలిగిన ఉన్న ఈ హోటల్‌లో పారిశుధ్య పరిస్థితులు, ఆహార తయారీ, నిల్వ విధానాలు, లైసెన్స్‌ వంటి వాటిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. రెండు రోజుల కిందట వండి నిల్వ చేసిన కూరలు, రెండు, మూడు రోజులు క్రితం తయారుచేసిన ఆహార పదార్థాలు, సుమారు వారం కిందట వండిన పదార్థాలను డీప్‌ ఫ్రీజర్‌, రిఫ్రిజరేటర్‌లో నిల్వ చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. ఆయా ఆహార పదార్థాలను వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు తేల్చారు. సుమారు 46 కిలోల నిల్వ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. నమూనాలను తనిఖీల నిమిత్తం పంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో జిల్లా సేఫ్టీ ఆఫీసర్‌ జీవీ అప్పారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


డీఎస్‌సీ-2026 నోటిఫికేషన్‌?

జిల్లాలో 34 పోస్టులు

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్‌సీ-2026 నోటిఫికేషన్‌ జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే దీనిని విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నది. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం 34 పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 20 ఖాళీగా ఉన్నాయి. అలాగే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు తొమ్మిది ఉన్నాయి. ఇవికాకుండా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2, సెకండరీ గ్రేడ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3 ఖాళీ ఉన్నాయి. మొత్తం 34 పోస్టులు భర్తీచేస్తారు. రిజర్వేషన్ల వివరాలు నోటిఫికేషన్‌లో వస్తాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. పూర్తి వివరాలు బుధవారం వెల్లడయ్యే అవకాశం ఉంది.


టెండర్లలో అక్రమాలు

కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు

రెండేళ్లపాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన జీవీఎంసీ కమిషనర్‌

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టు ఏజెన్సీలపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ చర్యలు తీసుకున్నారు. టెండర్‌ పిలిచినప్పుడు బాగా తక్కువకు బిడ్‌ వేసి, పనులు పూర్తయిన తర్వాత అధిక మొత్తంలో బిల్లులు తీసుకుంటున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం వాస్తవమేనని నిర్ధారణ కావడంతో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌తోపాటు డ్రాయింగ్‌ బ్రాంచిలో జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఇద్దరు, ఒక అవుట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఒకరిని రెండు రోజుల కిందట కమిషనర్‌ సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. తాజాగా ఉత్తర జోన్‌లో మూడు పనులకు సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరిగినట్టు తేలడంతో ఆర్‌ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, గోస్తనీ కన్‌స్ట్రక్షన్స్‌ ఏజెన్సీలను రెండేళ్లపాటు టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే డిపాజిట్లను వారికి తిరిగి చెల్లించకుండా జప్తు చేయాలని ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. జీవీఎంసీకి చెందిన టెండర్లు, పనుల నాణ్యతలో అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన అధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లు కూడా చర్యలకు గురికావాల్సి ఉంటుందని కమిషనర్‌ హెచ్చరించారు.


నగరంలో ఆపరేషన్‌ గరుడ

మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, దుకాణాలపై దాడులు

మెడికేర్‌ ఫార్మా డిస్ర్టిబ్యూటర్‌ స్టోర్‌లో గడువు ముగిసిన మందుల గుర్తింపు

డ్రగ్‌ కంట్రోల్‌, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, ఈగల్‌ అధికారుల సంయుక్త తనిఖీలు

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

నార్కోటిక్‌ డ్రగ్స్‌ విక్రయించే డిస్ర్టిబ్యూటింగ్‌ స్టోర్స్‌, మెడికల్‌ దుకాణాలపై బుధవారం ఔషధ నియంత్రణ విభాగం, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), విశాఖ ఈగల్‌ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. ఆపరేషన్‌ గరుడ పేరిట నిర్వహించిన తనిఖీల్లో అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్డులోని మెడికేర్‌ ఫార్మా డిస్ర్టిబ్యూటర్స్‌ (హోల్‌సేల్‌ ఎన్‌ఆర్‌ఎక్స్‌ మెడిసిన్‌ షాప్‌)లో నిబంధనలకు విరుద్ధంగా, గడువు ముగిసిన మందులను గుర్తించారు. క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగుల నొప్పి నివారణకు వినియోగించే రుమార్ఫ్‌ ఇంజక్షన్లు, శస్త్రచికిత్సల సమయంలో నొప్పి తగ్గించేందుకు అందించే ఫెంట్‌ వంటి ఇంజక్షన్లు భారీగా నిల్వ ఉన్నట్టు తేలింది. వీటిలో గడువు ముగిసిన రుమార్ఫ్‌ ఇంజక్షన్లు 170 యాంపిల్స్‌, ఫెంట్‌ ఇంజక్షను 530 యాంపిల్స్‌ గుర్తించారు. ఎన్‌డీపీఎస్‌ మందులు, స్టాక్‌ రిజిస్టర్‌లో లోపాలను గుర్తించారు. గడువు ముగిసిన మందులను ఎందుకు తొలగించలేదో వివరణ ఇవ్వాలని లైసెన్సుదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విశాఖ ఈగల్‌ రీజనల్‌ ఆఫీసర్‌, అడిషనల్‌ ఎస్సీ సీహెచ్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ మేరకే మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలను గుర్తించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఈగల్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ టి.కల్యాణి, ఎన్‌సీబీ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌బాబు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అభిప్రియ, ఈగల్‌, ఎన్‌సీబీ సిబ్బంది పాల్గొన్నారు.


సెల్ఫీ వీడియో కలకలం

ఈనెల 9న యువకుడి ఆత్మహత్య

అంతకుముందు తీసుకున్న వీడియో వైరల్‌

ప్రియురాలు మోసం చేసిందని వాంగ్మూలం

తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన

ఎంవీపీ పోలీసుల తీరుపై ఆరోపణలు

ఎంవీపీ కాలనీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రియురాలు, మరో వ్యక్తి కలిసి తనను మోసం చేశారని, దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఎంవీపీ పోలీసులు తనతోనే బైండోవర్‌ రాయించుకున్నారని చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్‌బీ కాలనీ బాబా బజారు పక్కన నివసించే యాగ్నాల జగదీష్‌ (35) ఈ నెల తొమ్మిదో తేదీన తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందాడు. అతడి సోదరుడి ఫిర్యాదు మేరకు...ఆర్థిక సమస్యలు, ప్రియురాలు వదిలి వెళ్లిపోవడం వల్ల మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన జగదీష్‌ సెల్ఫీ వీడియోలో ప్రియురాలు, మరో వ్యక్తి కలిసి తనను మోసం చేశారని, ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడి చేసి గాయపరచడంతో ఎంవీపీ పోలీసులను ఆశ్రయించానని, కానీ వారిపై చర్యలు తీసుకోకుండా, తనతో బైండోవర్‌ రాయించారని పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు ప్రియురాలు, మరో వ్యక్తి, అతడి స్నేహితులు కారణమని పేర్కొన్నాడు.

దీనిపై ఎంవీపీ స్టేషన్‌ సీఐ ప్రసాద్‌ను వివరణ కోరగా, ఆత్మహత్యకు ముందు మృతుడు రాసిన లేఖలో కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ప్రస్తావించాడన్నారు. కాగా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె జోలికి వెళ్లవద్దని బైండోవర్‌ రాయించామని వివరించారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 01:04 AM