కబ్జాదారులకు అడ్డా
ABN , Publish Date - May 27 , 2026 | 12:15 AM
మండలంలోని వెదుళ్లనరవ (జీవీఎంసీ 88వ వార్డు పరిధి) గ్రామం ప్రభుత్వ భూముల కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో స్థానిక నాయకులు వాటిని అక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూములతోపాటు గెడ్డ వాగులను సైతం కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మస్తున్నారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి రేకుల షెడ్లు నిర్మించారు.
వెదుళ్లనరవలో ప్రభుత్వ భూములు, గెడ్డవాగులు ఆక్రమణ
ప్రహరీగోడలు, రేకుల షెడ్ల నిర్మాణం
సెంట్లు చొప్పున విక్రయం
వైసీపీ నాయకులకు కూటమి నేతల సహకారం
సబ్బవరం, మే 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెదుళ్లనరవ (జీవీఎంసీ 88వ వార్డు పరిధి) గ్రామం ప్రభుత్వ భూముల కబ్జాదారులకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో స్థానిక నాయకులు వాటిని అక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూములతోపాటు గెడ్డ వాగులను సైతం కబ్జా చేసి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మస్తున్నారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి రేకుల షెడ్లు నిర్మించారు.
పారిశ్రామిక ప్రాంతాలైన గాజువాక, దువ్వాడలకు సమీపంలో వెదుళ్లనరవ ఉండడంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జిరాయితీ భూమి సెంటు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ధర పలుకుతున్నది. దీంతో స్థానికంగా వుండే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన చిన్నాచితక నాయకులు ప్రభుత్వ భూములను, గెడ్డవాగులను ఆక్రమించుకుంటున్నారు. వీటిని ప్లాట్లుగా విభజించి అనధికారికంగా సెంటు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు విక్రయిస్తున్నారు. తమ పార్టీ పెద్ద నేతల ద్వారా రెవెన్యూ అధికారులతో మాట్లాడి, త్వరలో పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడడం ఇక్కడ హక్కుగా మారింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోగా, ఇప్పుడు కూటమి నేతల సహకారంతో క్రయవిక్రయాలు జరుపుతున్నారు. మరికొంత మంది నాయకులు ఆక్రమించిన స్థలాల్లో రేకుల షెడ్లు, ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. రేకుల షెడ్లను గాజువాక, దువ్వాడ సమీపంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అద్దెకు ఇస్తున్నారు.
ఎక్కడెక్కడ ఆక్రమణలు..
సర్వే నంబరు 56లో 1.38 ఎకరాల్లో గెడ్డ వాగు ఉంది. దీనిని కొంత మంది ఆక్రమించుకొని షెడ్లు నిర్మిస్తున్నారు.
సర్వే నంబరు 113లో 1.85 ఎకరాల్లో గెడ్డవాగు/బాట ఉంది. స్థానిక నేతలు దీనిని ఆక్రమించడమే కాకుండా.. పక్కనే ఉన్న జిరాయితీ భూమి సర్వే నంబరుతో అమ్మేస్తున్నారు.
సర్వే నంబరు 99/18లో 1.53 ఎకరాల గెడ్డవాగు/బంజరు ఉంది. దీనిని ఆక్రమించుకొని కొంతమంది షెడ్లు నిర్మించుకున్నారు. రెవెన్యూ అధికారులు గతంలో ఒకసారి కూల్చివేయగా, ఆక్రమణదారులు మళ్లీ నిర్మించారు.
సర్వే నంబరు 33లో సుమారు 3.5 ఎకరాల్లో అల్లిమెట్ట/బంజరు ఉంది. ప్రస్తుతం ఈ మెట్ట చుట్టూ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
సర్వే నంబరు 76లో 2.2 ఎకరాల్లో గెడ్డవాగు ఉంది. కొంతమంది దీనిని గ్రావెల్‌తో పూడ్చేసి ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు..
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగిస్తాం
డి.అరుణ్‌చంద్ర, తహశీల్దారు, సబ్బవరం,
వెదుళ్లనరవలో ప్రభుత్వ భూములు, గెడ్డవాగుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చాయి. ఆయా ప్రదేశాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగిస్తాం. భూ కబ్జాలకు పాల్పడే వారిపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.