హైవేపై ఆగడాలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:00 AM
నగరంలో రాత్రివేళ ఆకతాయిలు, బైక్‌రేసర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి ఒంటిగంట దాటగానే ఎక్కడెక్కడి నుంచో చీమల్లా ఒకచోటకు చేరిపోతున్నారు.
రెచ్చిపోతున్న ఆకతాయిలు
పదుల సంఖ్యలో హైస్పీడ్ వాహనాలతో రేసింగ్‌లు
గతంలో బీచ్‌రోడ్డు, ఐటీహిల్స్, బీఆర్‌టీఎస్‌ల్లో నిర్వహణ
తాజాగా జాతీయ రహదారిపైనే స్టంట్‌లు
భయభ్రాంతులకు గురవుతున్న వాహనచోదకులు
చోద్యంచూస్తున్న పోలీసులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో రాత్రివేళ ఆకతాయిలు, బైక్‌రేసర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి ఒంటిగంట దాటగానే ఎక్కడెక్కడి నుంచో చీమల్లా ఒకచోటకు చేరిపోతున్నారు. హైస్పీడ్ బైక్‌లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేస్తూ వాహనచోదకులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఎవరిని ఢీకొడతారోననే భయంతో కొందరు వాహనచనోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. గతంలో బీఆర్‌టీఎస్‌రోడ్డు, బీచ్‌రోడ్డు, ఐటీహిల్స్‌రోడ్డులో రేసింగ్‌లతో రెచ్చిపోతున్న వారంతా తాజాగా నిత్యం రద్దీగా ఉండే జాతీయరహదారిపై స్టంట్‌లు చేస్తుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
నగరంలో కొంతమంది యువకులకు అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితులతో కలిసి గుంపుగా రోడ్లపైకి దూసుకురావడం, నిర్మానుష్యంగా ఉండే రోడ్లపై బైక్‌రేసింగ్‌లకు పాల్పడడం, హైస్పీడ్ బైక్‌లతో స్టంట్‌లుచేయడం ఫ్యాషన్‌గా మారింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వీరంతా హైస్పీడ్ వాహనాలతో ఒకచోటకు చేరిపోతున్నారు. పదుల సంఖ్యలో ఒకేసారి విపరీతమైన శబ్దాలు చేసుకుంటూ, అపరిమితవేగంతో మెరుపుల్లా దూసుకుపోతుంటారు. పోలీసులు వారిని గుర్తించి పట్టుకునేందుకు యత్నించినా అదేవేగంతో వారికే భయం కలిగిస్తుంటారు. పోలీసులుకూడా వారిని అడ్డుకుంటే తమను ఢీకొట్టడం లేదంటే వారే ప్రమాదానికి గురవుతారనే భయంతో పట్టుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకుంటారు. చాలాకాలంగా బీచ్‌రోడ్డు, ఐటీహిల్స్, బీఆర్‌టీఎస్‌రోడ్డులో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. కానీ ఇటీవల మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, సిరిపురం రోడ్డుతోపాటు పోర్టు ఆస్పత్రి జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం జంక్షన్ మధ్య బైక్‌రేసర్లు, రిప్‌రేసరు ్ల(ఆకతాయిలు, జులాయిగా తిరిగేవారు) హడావుడి పెరిగిపోయింది. జాతీయరహదారి నిత్యం వాహన రాకపోలతో రద్దీగా ఉంటుందని తెలిసినప్పటికీ హైస్పీడ్, భారీ శబ్దం వెలువరించే వాహనాలతో రోడ్డు మధ్యలో స్టంట్‌లు, జిగ్‌జాగ్‌లు, ర్యాష్‌డ్రైవింగ్ తదితర విన్యాసాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆ సమయంలో రాకపోకలు సాగించే వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. మెరుపువేగంతో తమను ఢీకొడతారనే భయంతో వాహనాలను రోడ్డుపక్కన నిలిపివేసి, వారు వెళ్లాక రోడ్డెక్కుతున్నారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
పోర్టు ఆస్పత్రి జంక్షన్‌లో శనివారం రాత్రి 1.30 గంటల సమయంతో 20 మందికిపైగా యువకులు హైస్పీడ్‌బైక్‌లతో ఒకచోట చేరారు. అక్కడ కొందరు తమబైక్‌లపై స్టంట్‌లు చేస్తుండగా, మరికొందరు వాహనాలను స్టార్ట్‌చేసి శరవేగంగా తలో దిక్కు దూసుకుపోయారు. మరికొందరు ఎక్కడి నుంచో వాహనాలతో వేగంగా వచ్చి, అక్కడ ఆగుతున్నారు. అక్కడికి 500 మీటర్లు దూరంలోని అక్కయ్యపాలెం జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసులు వచ్చిపోయే వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లు ఇచ్చి ముఖం కడిగించి పంపే పనిలో ఉన్నారు. కానీ భారీ శబ్దాలతో రిప్‌రేసర్లు, బైక్‌రేసర్లు సమీపంలోనే అలజడి సృష్టిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. అంతేకాకుండా రాత్రిసమయంలో నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో పరిస్థితి ఎలా ఉందో పోలీస్ కంట్రోల్‌రూమ్‌నుంచి సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని ప్రత్యక్షంగా పరిశీలిస్తుంటారు. అనుమానాస్పద కదలికలు లేదా దృశ్యం కనిపిస్తే వెంటనే సమీపంలోని రాత్రిగస్తీ సిబ్బందికి సమాచారం ఇస్తారు. అయితే శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోర్టు ఆస్పత్రి జంక్షన్‌లో జాతీయరహదారిపై యువత అలజడి సృష్టించినా వారు కూడా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయాలి
నగరంలో బైక్‌రేసింగ్‌లు, రిప్‌రేసర్ల అలజడిని అడ్డుకునేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖలోని కొందరు అఽఽధికారులు అభిప్రాయపడుతున్నారు. రేసర్లు, రిప్‌రేసర్లను పోలీసులు ఎక్కడైనా గుర్తించి పట్టుకోవాలని ప్రయత్నిస్తే వారి హైస్పీడ్ వాహనాలతో పోలీసు వాహనాలు పోటీ పడలేకపోతున్నాయి. అదే సమయంలో పోలీసులు ఐదు, పది మంది ఉన్నా రేసర్లు తలో దిక్కు వెళ్లిపోతారు కాబట్టి పట్టుకోవడం సాధ్యం కాదు. ఎవరినైనా పట్టుకుందామని చివరి వరకు వెంబడిస్తే వారు ప్రమాదానికి గురవడం లేదా వేగంగా వెళ్లి పోలీసులే అదపుతప్పి ప్రమాదానికి గురవడమో జరుగుతోంది. దీంతో పోలీసులు ఆ ప్రయత్నాలు విరమించుకుంటుటున్నారు. వాహనాల నంబర్లు నమోదుచేసుకుని మరుసటి రోజు పట్టుకుందామనుకున్నా నంబరు ప్లేట్లు లేని వాహనాలనే రేసింగ్‌లకు వినియోగిస్తున్నారు. కొన్నింటికి ఉన్నా మెగ్నటిక్ సిస్టం దాని మీద పెట్టి అంటుకునేలా చేస్తున్నారు. దీంతో వాహనాల నంబర్లు గుర్తించే వీలుండడం లేదు. మఫ్టీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తే ఏదో ఒక వాహనంలో కూర్చొని రేసర్ల కదలికలను గమనిస్తుంటారు. ఎవరైనా రేసర్ వెళితే వెంబడించి ఎక్కడో ఒకచోట ఆగినపుడు అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా మిగిలినవారిని కూడా పట్టుకోవడం సాధ్యమవుతుందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.