రూ.1.06 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:53 AM
గత నెలలో జరిగిన 48 చోరీలకు సంబంధించి 59 మందిని నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.06 కోట్లు విలువైన సొత్తును రికవరీ చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు.
48 కేసుల్లో 59 మంది అరెస్టు
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
గత నెలలో జరిగిన 48 చోరీలకు సంబంధించి 59 మందిని నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.1.06 కోట్లు విలువైన సొత్తును రికవరీ చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు. కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన ‘క్రైమ్ మేళా’లో స్వాధీనం చేసుకున్న సొత్తును బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో నగరంలో 68 చోరీ కేసులు నమోదైతే వాటిలో 48 కేసులను ఛేదించామన్నారు. 69 మందిని అరెస్టు చేసి వారి నుంచి 1.02 కిలోల బంగారం, 1.01 కిలోల వెండి, రూ.1,72,621 నగదు, పది మోటార్ సైకిళ్లు, ఒక వ్యాన్, ఒక ల్యాప్‌తోపాటు 506 సెల్‌ఫోన్‌లు, 90 కిలోల రాగి వైర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా కీలక ప్రాంతాల్లో 367 సీసీ కెమెరాలు, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 367 చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతామాధురి, సీసీఎస్ సీఐ కోరాడ రామారావు, క్రైమ్ ఎస్‌ఐలు సూరిబాబు, వెంకటరావు పాల్గొన్నారు.
కరుణించిన వరుణుడు
చల్లబడిన వాతావరణం
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
నగరంలో శనివారం ఉదయం సుమారు అరగంట సేపు వర్షం పడింది. తెల్లవారుజాము నుంచి మేఘాలు ఆవరించాయి. ఉదయం తొమ్మిది గంటలకు చినుకులతో ప్రారంభమైన వాన అరగంట గట్టిగా కురిసింది. ఆ తరువాత జల్లులు కొనసాగాయి. ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, మహారాణిపేట తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన నగర వాసులకు శనివారం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. అయితే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి వర్షాలు ఇంకా పడితేనే నీటి సమస్య తీరుతుందని, లేదంటే ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ నగరంలోని మహారాణిపేటలో 45.5, ప్రభుత్వ కంటి ఆస్పత్రి వద్ద 26.9, గంగవరంలో 13.5, షీలానగర్‌లో 11.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.