Share News

జీవీఎంసీలో లైంగిక వేధింపుల కలకలం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:15 AM

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు అంశం కలకలం రేపుతోంది.

జీవీఎంసీలో లైంగిక వేధింపుల కలకలం

మహిళా ఉద్యోగిపై అదేసెక్షన్‌ ఉద్యోగి కన్ను

ఆమె ఎక్కడున్నా సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డింగ్‌

సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం

ఆధారాలతో సహా ఫిర్యాదుచేసిన బాధితురాలు

సర్దుకుపోవాలని ఓ అధికారి ఉచిత సలహా

దిక్కుతోచని స్థితిలో బాధితురాలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు అంశం కలకలం రేపుతోంది. ఆమె పనిచేస్తున్న చోట ఓ సహోద్యోగి గతకొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోపాటు ఆమె కూర్చున్న చోటకు వెళ్లి సెల్‌ఫోన్‌లో వీడియోలు తీయడం, సహోద్యోగుల వద్దకు వెళ్లి ఆమెతో తనకు వివాహేతర సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సర్దుకుపోవాలంటూ బాధితురాలికి ఉచితసలహా ఇవ్వడంతో ఏంచేయాలో దిక్కుతోచక ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితురాలు సహోద్యోగుల వద్ద కన్నీటిపర్యంతవుతోంది.

జీవీఎంసీ ప్రధానకార్యాలయంలో అత్యంతకీలకమైన సెక్షన్‌లో ఓ మహిళ ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. అదే సెక్షన్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఆమెపై కన్నేశారు. తరచూ వేఽధించడం, ఎక్కడకు వెళ్లినా వెంట కాపలాగా వెళ్తున్నారు. ఇటీవల అతడి వేధింపులు పెరిగిపోయాయి. ఆమె విధులకు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయేవరకు వెంట పడి సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. సహోద్యోగులతో మాట్లాడినా, ఫైల్స్‌కు సంబంధించిన సమాచారంపై చర్చించినా వారిస్తుండడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. అంతేకాకుండా ఆమెతో తనకు వివాహేతరసంబంధం ఉందని ప్రచారం చేస్తుండడంతో నాలుగు రోజులు కిందట విభాగంలోని ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదుచేసింది. దీనికి సంబంధించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీని కూడా ఆమె చూపించింది.

లైంగిక వేధింపులపై ఆరోపణలు వచ్చినవెంటనే బాధ్యుడైన ఉద్యోగిపైచర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయంచేయాల్సిన అధికారి నిందితుడ్ని కాపాడేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాతపూర్వకంగా ఫిర్యాదుఇస్తే చర్యలు తీసుకుంటామనడంతో మరుసటిరోజు ఫిర్యాదు అందజేసింది. అయితే ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, జోనల్‌ కార్యాలయాలకు బదిలీచేసేస్తామని సదరు అధికారి పరోక్షంగా బాధితురాలిని బెదిరించారు.

ఫిర్యాదు విషయం తెలుసుకున్న నిందితుడు తనను ఎవరూ ఏమీ చేయలేరని, అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని మరో ఉద్యోగితో పరోక్షంగా బాధితురాలిని బెదిరించాడు. ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడం, వేధింపులు ఎక్కువకావడంతో శనివారం సాయంత్రం బాధితురాలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీరుపెట్టుకోవడంతో వారంతా స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్పటికప్పుడు ఈ ఉదంతంపై విచారణకు సూపరింటెండెంట్‌స్థాయి అధికారికి అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. కార్యాలయంలోని మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, వివరాలు అధికారుల వద్ద ఉన్నా చర్యల్లేకపోవడం దారుణమని వాపోతున్నారు. ఈ సమస్యపై జీవీఎంసీ కమిషనర్‌ దృష్టిసారించాలని, లేదంటే మహిళా ఉద్యోగులు పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:15 AM