మత్స్యకారుల్లో ‘అల’జడి!
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:14 AM
మత్స్యకార కుటుంబాల్లో ఆదివారం తీవ్ర అలజడి రేపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తాపడి ఆరుగురి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లిన బోటు బోల్తా
ఆరుగురు మత్స్యకారుల గల్లంతు
గంగవరానికి దక్షిణంగా సంఘటన
ఒకేసారి ఇంతమంది గల్లంతవడం ఇదే తొలిసారి
రంగంలోకి నాలుగు నౌకలు, రెండు హెలికాప్టర్లు
సాయంత్రం వరకు గాలించినా లభించని ఆచూకీ
మరో బోటులోని తొమ్మిది మందిని ఒడిశా తీరంలో రక్షించిన అధికారులు
విశాఖపట్నం/ బీచ్‌రోడ్డు/ మహారాణిపేట/ భీమిలి రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
మత్స్యకార కుటుంబాల్లో ఆదివారం తీవ్ర అలజడి రేపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తాపడి ఆరుగురి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ వారి కోసం తీరానికి చేరుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సముద్రంలో బోట్లు ప్రమాదానికి గురైనపుడు ఒకరో ఇద్దరో గల్లంతవడం, మరికొందరు గాయపడడం సాధారణంగా జరుగుతూనే ఉంది. అలలు తీవ్ర ఉధృతితో ఉన్నప్పుడు కూడా చేపలవేట సాగిస్తూ తిరిగి క్షేమంగా వస్తుంటారు. అయితే ఈ సారి బోటుబొల్తా పడిన ఘటనలో ఏకంగా ఏడుగురు గల్లంతవడం, వారిలో ఒకరు ప్రమాదం నుంచి బయటపడగా మరో ఆరుగురి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతమంది మత్స్యకారులు ఒకేసారి ప్రమాదంలోపడిన సందర్భాలు గతంలో లేవని అంటున్నారు. ఒకేసారి ఆరుగురి ఆచూకీ లభించకపోవడంతో ఫిషింగ్‌హార్బర్, కొత్త జాలారిపేట, జబ్బరతోటలో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాల్లో కలకలం రేగింది. అది కూడా విశాఖ తీరానికి ముఖ్యంగా గంగవరం పోర్టుకు దక్షిణంగా సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరగడం మరింత ఆందోళనకు గురిచేసింది. సముద్రంలో శనివారం మఽధ్యాహ్నం మూడు గంటల తరువాత ప్రమాదం జరిగి ఉంటుందని, ఆ సమయంలో అలలు ఎగసిపడడంతో బోటు తిరగబడి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం గుర్తించిన మర్చంట్ నౌక సిబ్బంది అతికష్టమ్మీద ఒకరిని రక్షించి ఉంటారని, మిగిలిన వారి విషయంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు.
ప్రతి రోజు ఉదయం చిన్నబోట్లపై పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. అయితే మూడు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈ బోట్లు ఒడ్డునే ఉండిపోయాయి. ఉదయం బోట్లు వెళ్లి ఉంటే తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి మత్స్యకారులను రక్షించేవారని మత్స్యకారులు చెబుతున్నారు.
ఫిషింగ్‌హార్బర్ నుంచి సముద్రంలో చేపలవేట కోసం సుమారు 700 మర పడవలు, 1000 వరకు చిన్నబోట్లు వినియోగిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలమంది మత్సకారులు ఇక్కడికి వచ్చి చేపలవేట సాగిస్తుంటారు. ట్యూనా చేపల వేట సాగించే బోట్లలో 10 మంది, మర పడవల్లో ఎనిమిది మంది వరకు వెళతారు. తుఫాన్‌లు సంభవించినప్పుడు మినహా మిగిలిన సమయాల్లో సముద్రం అలజడిగా ఉన్నా జాగ్రత్తలు తీసుకుని చేపలవేట సాగిస్తుంటారు. ఒక్కోసారి ప్రమాదాలకు గురై ఉత్తరానభావనపాడు, గోపాలపూర్, పూరి, పారాదీప్, దక్షిణాన కాకినాడ హార్బర్‌లకు చేరుకుంటారు. కొన్నిసార్లు సముద్రం మధ్యలో ప్రమాదం సంభవిస్తే ఆ సమయంలో వచ్చే వాణిజ్యనౌకలు, నేవీ నౌకలు రక్షిస్తుంటాయి. సముద్రంలోపల ప్రమాదాలు జరిగితే హెలికాప్టర్ల ద్వారా రక్షించి ఒడ్డుకు చేరుస్తుంటారు. కానీ శనివారం మధ్యాహ్నం సంభవించిన బోటు ప్రమాదంపై అధికారులకు ఆలస్యంగా సమాచారం అందిందని చెబుతున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బోటులో ఉన్న వారి నుంచి సమాచారం లేకపోవడం, బోటు హార్బర్‌కు చేరకపోవడంతో వారి కుటుంబ సభ్యులు మత్స్యకార నాయకులకు సమాచారం ఇచ్చారు. మెంటనే హార్బర్ నుంచి రెండుమూడు బోట్లు వేసుకుని వెళ్లి ఉంటే ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు హెచ్చరికలు చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు
రెక్కాడితేగానీ డొక్కాడని మత్స్యకార కుటుంబాల్లో శనివారం జరిగిన బోటు ప్రమాదం ఆందోళనకు గురిచేసింది. రెండుగంటల్లో వస్తామన్న వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సురక్షితంగా తీరానికి చేరుకుంటారనే నమ్మకం ఉన్నా, వారి ముఖాల్లో ఆందోళన కనిపించింది. ఆదివారం ఉదయం వేలమందితో కిటకిటలాడే ఫిషింగ్ హార్బర్‌లో విషాదం నెలకొంది. గల్లంతైన ఏడుగురిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారె కుటుంబానికి చెందిన వారు. హార్బర్‌లోకి పెద్ద ఎత్తున మత్స్యకారులు, వారి బంధువులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వారిని ఓదార్చారు. కారె గరగయ్య, కారె చిన్నయ్యకు ఇద్దరేసి చిన్న పిల్లలున్నారు. తమ వారు క్షేమంగా ఉన్నారని బయటకు చెబుతున్నా మాట్లాడలేకపోతున్నారు. బంధువులు వచ్చినపుడు భోరున విలపిస్తున్నారు. దీంతో హార్బర్ ప్రాంతంలో విషాదం నెలకొంది.
బోల్తాపడిన బోటుపైనే 9 గంటలు ..
సహాయం కోసం ఆర్తిగా ఎదురుచూశాం
ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారె చిన్న
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకడైన కారె చిన్నను ఎంవీ యూనివర్స్ వెల్తీ మర్చంట్ నౌక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనను చిన్న నౌకా సిబ్బందికి తెలియజేయగా, దానిని వీడియో తీసి అధికారులకు పంపించారు. ఆ వీడియో సారాంశమిది... ‘సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. గాలి ఎక్కువైంది. అప్పటికే వేట పూర్తవడంతో వెనక్కి వస్తున్నాం. తామున్న చోటుకు తీరం పది మైళ్లు ఉంటుంది. ఇంతలో పెద్ద అల, గాలి వీయడంతో బోటు తిరగబడిపోయింది. కష్టపడి అదే బోటుపైకి చేరుకున్నాం.పైకి వచ్చేసరికి ఆరుగురమే కనిపించాం. ఒకరు బోటులోనే ఉండిపోయాడు. తొమ్మిది గంటలపాటు సహాయం కోసం చూస్తూ ఉండిపోయాం. బోటు కిందకు వెళ్లిపోతుండడంతో అందులోని కొన్ని వస్తువుల సాయంతో ఈదుతున్న మాకు దగ్గరలో షిప్ కనిపించింది. ఈదుకుంటూ వెళ్లేందుకు కాళ్లు సహకరించలేదు. ఇద్దరు ఉండిపోయారు. నలుగురు షిప్ వైపు ఈదుకుంటూ వెళ్లాం. ఓడకు దగ్గరకు చేరుకుని యాంకరేజ్ పాయింట్‌ను పట్టుకుని కేకలువేశాను. అప్పటికే గాలి ఎక్కువవడంతో పడిపోయాను. గుర్తించిన సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి పైకి లాగారు. మిగిలిన వారి సంగతి తెలియలేదు.
ముమ్మరంగా గాలింపు చర్యలు
- హోంమంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు అందించాలన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, ఐజీ మెరైన్స్, కోస్టల్‌గార్డ్ డీఐజీ, విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, నగర పోలీస్ కమిషనర్, విజయనగరం ఎస్సీ, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో మత్స్యకారుల గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టిందని ఎంఎస్‌ఎంఈశాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు వచ్చి గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేస్తోందన్నారు. మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం రెండు గంటలు సమయంలో ఫోన్‌లో మాట్లాడారని, అనంతరం అర గంటకే వారి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందారన్నారు. రాత్రి 10 గంటలు సమయంలో అధికారులకు సమాచారం అందగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌తో మాట్లాడి నేవీ, కోస్టుగార్డ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుతం నేవీకి చెందిన నౌకలు, కోస్టుగార్డుకు చెందిన హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించే వరకు కొనసాగిస్తామన్నారు.
రెండుగంటల్లో వస్తానన్నాడు
సంద్రంలో వేటకు గురువారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నా భర్త చిన్న ఫోన్ చేసి రెండుగంటల్లో హార్బర్‌కు వచ్చేస్తామన్నాడు. సాయంత్రం 4.30 గంటలకు ఫోన్ చేస్తే స్పందన లేదు. సిగ్నల్స్ లేవనుకున్నా. రాత్రి అయినా రాకపోవడంతో కంగారు పడ్డాం. రాత్రి 7.30 గంటలకు మరోసారి ఫోన్‌చేసినా ఫలితం లేకపోవడంతో మత్స్యకార నేతలకు చెప్పాం. వారితో పాటు రాత్రి ఒంటి గంట వరకు ప్రయత్నించినా ఫోన్‌లు కలవలేదు. అఽధికారులకు తెలియజేశాం. ఆదివారం ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నా ఫలితం లేకపోయింది.
- మసేనమ్మ, కారి చిన్న భార్య
తిరిగి వస్తారనే నమ్మకముంది
మాది విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని కుంకాం. బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాం. ఇద్దరు పిల్లలు. భర్త చేపలవేటకు వెళ్లి తీసుకువచ్చిన సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాం. నా భర్త, మిగిలిన వారంతా క్షేమంగా ఇంటికి వస్తారనే నమ్మకం ఉంది. అంతా గంగమ్మతల్లి దయ.
- దమయంతి, కారి గరగయ్య భార్య
నిన్ననే మాట్లాడాను
భోగాపురం మండలం ముక్కాం సొంతూరు. మాకు ఇద్దరు పిల్లలు. ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చాం. చేపలవేటే ప్రధాన వృత్తి. సముద్రంలో వేటకు వెళ్లిన ఐదు నుంచి వారం రోజుల్లో తిరిగి వస్తుంటారు. ఈ సారి కూడా శనివారం మా ఆయనతో మాట్లాడాను.
- మౌనిక, కారి చిన్నయ్య భార్య
నాన్న కోసం ఎదురుచూపు
నాలుగు రోజుల క్రితం నాన్న కారె చిన్న బోటులో చేపలవేటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం రావాల్సి ఉంది. 24 గంటలు గడిచినా జాడలేకపోవడంతో ఆందోళనగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. నేవీ నౌకలతో గాలించి మా నాన్నతోపాటు మిగిలిన వారినీ సురక్షితంగా తీసుకురావాలి.
- కారి పోలిపల్లి, సీతోడు కుమార్తె