Share News

ఇప్పటికీ మూతబడి!

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:05 PM

వేసవి సెలవులు ముగిసి 14 రోజులు అవుతున్నా జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని పెదగంగవరం ఎంపీపీ పాఠశాల ఇప్పటికీ తెరుచుకోలేదు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో కొత్త అడ్మిషన్లు లేవు.

ఇప్పటికీ మూతబడి!
పెదగంగవరం ఎంపీ పాఠశాలలో ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు

టీచర్‌ లేక 14 రోజులుగా తెరుచుకోని పెదగంగవరం ఎంపీపీ పాఠశాల

ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు టీసీ ఇచ్చే నాథుడు కరువు

కొత్త అడ్మిషన్లు తీసుకోని వైనం

పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన

సీలేరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులు ముగిసి 14 రోజులు అవుతున్నా జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని పెదగంగవరం ఎంపీపీ పాఠశాల ఇప్పటికీ తెరుచుకోలేదు. ఉపాధ్యాయుడు లేకపోవడంతో కొత్త అడ్మిషన్లు లేవు. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వేరే పాఠశాలలో ఆరవ తరగతిలో చేరదామంటే టీసీలు ఇచ్చే నాథుడు కరువయ్యాడు. తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళనగా ఉందని, ఎంఈవో దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెదగంగవరం ఎంపీపీ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సుమారు 55 మంది విద్యార్థులు ఉన్నారు. గత విద్యా సంవత్సరం మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌)పై పని చేసే ఉపాధ్యాయుడిని ఇక్కడ నియమించారు. అయితే ఈ విద్యా సంవత్సరానికి ముందే ఆ టీచర్‌ను వేరే చోటకు బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇంత వరకు ఎవరినీ నియమించలేదు. దీంతో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నుంచి ఈ స్కూల్‌ తెరుచుకోలేదు. కొత్త అడ్మిషన్లు తీసుకునే వారు లేక, ఐదవ తరగతి పూర్తయి ఆరవ తరగతిలో చేరదామనుకునే విద్యార్థులకు టీసీలు ఇచ్చే ఉపాధ్యాయుడు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల తెరుచుకోని కారణంగా కొందరు విద్యార్థులు ఇళ్లకే పరిమితం కాగా, కొందరు పశువుల కాపరులుగా, మరికొందరు అడవుల్లో, వాగుల వద్ద తిరుగుతూ చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి పెదగంగవరం ఎంపీపీ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:05 PM