ఇంకా వైసీపీ నేతల సేవలోనే...!
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:03 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పెద్దలతో అంటకాగిన వారిని విశాఖపట్నంలో కీలక పోస్టుల్లో ఇంకా కొనసాగించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
టిడ్కో మాజీ చైర్మన్ భార్యకు రిటైరైన మరుసటిరోజే పోస్టింగ్
వైసీపీ తీసుకొచ్చిన మరో అధికారి ఐదేళ్లుగా విశాఖలోనే...
ఇద్దరూ ఆడిట్ విభాగానికి సంబంధించినవారే...
పట్టని కూటమి ప్రజా ప్రతినిధులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి పెద్దలతో అంటకాగిన వారిని విశాఖపట్నంలో కీలక పోస్టుల్లో ఇంకా కొనసాగించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తిచేసుకొని సంబరాలు కూడా చేసుకుంటోంది. అయినా జిల్లాలో ఎవరు?...ఏమిటో కూడా పట్టించుకోకుండా వ్యవహారాలు నడుస్తున్నాయి.
జె.ప్రసన్నకుమార్ వైసీపీ నేత. పార్వతీపురం మన్యం జిల్లా స్వస్థలం. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయనకు టిడ్కో చైర్మన్‌గా పదవి ఇచ్చారు. ఆయన భార్య పేరు మల్లికాంబ. ఆడిట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ హోదా కలిగిన అధికారిణి. జీవీఎంసీలో ఐదేళ్లు ఫైనాన్స్ అడ్వయిజర్‌గా పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పోస్టింగ్ వేయించుకున్నారు. మే నెల 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆ మరుసటిరోజే అంటే జూన్ ఒకటో తేదీనే ఆమెకు విశాఖ జిల్లా టిడ్కో (వీఎంఆర్‌డీఏ భవనంలో ఉంది) కార్యాలయంలో ఫైనాన్స్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వమా?, వైసీపీ ప్రభుత్వమా?...అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైందని అంతా బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఆమె నాలుగు చేతులతో పనులు చక్కబెడతారు. అందుకే రిటైర్ అయిన వెంటనే పోస్టింగ్ ఇచ్చారనుకుంటే పొరపడినట్టే. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో ఎక్కడ పనిచేసినా అది నామమాత్రమే అనేది ఆడిట్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఐదేళ్లుగా జీవీఎంసీలోనే
జీవీఎంసీ ఫైనాన్స్ విభాగంలో చీఫ్ ఎగ్జామినర్ పోస్టు ఒకటి ఉంది. వైసీపీ హయాంలో ఈ జోన్‌కు సంబంధం లేని, వాసుదేవరెడ్డి అనే అధికారిని ఏలూరు నుంచి తీసుకువచ్చి 2021లో నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి వారందరినీ వెనక్కి పంపించి, మంచి వారిని వేసుకోవాలి. కానీ ఇప్పటికీ ఆయన అదే సీటులో ఉన్నారు. ఐదేళ్లు పూర్తయిపోయాయి. కనీసం బదిలీ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఆయన కూడా ఆడిట్ విభాగానికి చెందిన అధికారే. అసలు రాష్ట్ర అడిట్ కార్యాలయంలో ఏమి జరుగుతున్నదో ప్రభుత్వ పెద్దలు పరిశీలించాల్సిన అవసరం ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.