Share News

జడ్పీ చైర్మన్‌ పీఠానికి గట్టి పోటీ

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:29 PM

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు జనసేనకు చైర్మన్‌ పదవి కేటాయించగా, వైసీపీ మాత్రం మాజీ ఎంపీ, కొయ్యూరు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన గొడ్డేటి మాధవిని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించింది.

జడ్పీ చైర్మన్‌ పీఠానికి గట్టి పోటీ
జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం

తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జడ్పీటీసీ సభ్యులు

వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన చైర్మన్‌ ఎంపిక

చైర్మన్‌ అభ్యర్థి గొడ్డేటి మాధవి ఓడిపోవడమే కారణం

(పాడేరు- ఆంధ్ర జ్యోతి)

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు జనసేనకు చైర్మన్‌ పదవి కేటాయించగా, వైసీపీ మాత్రం మాజీ ఎంపీ, కొయ్యూరు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన గొడ్డేటి మాధవిని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆమె అనూహ్యరీతిలో ఓటమి పాలవ్వడంతో ప్రస్తుతం చైర్మన్‌ పదవికి పోటీ పెరిగింది.

పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు చొప్పున జడ్పీ చైర్మన్‌ పదవి దక్కించుకోవాలని ఎవరికి వాళ్లు వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన సీదరి రాంబాబు, చింతపల్లి జడ్పీటీసీ సభ్యురాలు కోరాబు అనుషా చైర్మన్‌ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో రాంబాబు రెండు మార్లు సర్పంచ్‌గా పని చేయడంతో పాటు వైసీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే అనుషా చింతపల్లి ఎంపీపీగా పని చేశారు. దీంతో పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి వీరిద్దరూ పోటీపడుతున్నారు. అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానంలో రాజకీయ కుటుంబానికి చెందడంతో పాటు వైస్‌ ఎంపీపీగా పని చేసిన హుకుంపేట జడ్పీటీసీ సభ్యురాలు ఒంటూబు ప్రియాంక, అలాగే రాజకీయ కుటుంబ నేపథ్యమున్న అనంతగిరి జడ్పీటీసీ సభ్యులు డూరు జయవర్థిని చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. గతంలో అరకులోయ అసెంబ్లీ స్థానం పరిధిలోని మహిళకు జడ్పీ చైర్మన్‌ పదవి దక్కడంతో ఈ దఫా పాడేరు అసెంబ్లీ పరిధిలోని నేతకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వ్యూహాత్మక తప్పిదంతో వెనుకబడిన కూటమి పార్టీలు

జిల్లాలోని జడ్పీటీసీ స్థానాల విషయంలో కూటమి పార్టీలు వ్యూహాత్మకమైన తప్పిదాలు చేయడంతోనే ఓటమి పాలయ్యాయనే వాదన వినిపిస్తున్నది. వాస్తవానికి జిల్లాలో పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, అరకులోయ, అనంతగిరి, కొయ్యూరు మండలాల్లో టీడీపీకి, డుంబ్రిగుడ మండలంలో బీజేపీకి పట్టుంది. అయితే జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో కూటమి పార్టీలు సమన్వయంగా వ్యవహరించకపోవడంతో పాటు జనసేన, బీజేపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో మూడు జడ్పీటీసీ స్థానాలకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిని నామినేషన్‌ ఆఖరు రోజున ఎంపిక చేశారు. అలాగే డుంబ్రిగుడలో జనసేన అభ్యర్థి పోటీలో ఉండగా, బీజేపీ, బీజేపీ రెబల్‌ అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. అనంతగిరిలో టీడీపీకి పట్టున్నప్పటికీ బలమైన అభ్యర్థి కాకపోవడంతో ఓటమి చెందారు. పెదబయలులో టీడీపీ నేతలు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడంతో పార్టీకి పట్టున్నప్పటికీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఓటింగ్‌ చేయించుకోవాల్సిన తరుణంలో కూటమి పార్టీలు అందుకు భిన్నంగా ముందుకు వెళ్లడంతో జడ్పీ చైర్మన్‌ పీఠాన్ని చేజార్చుకున్నాయి.

Updated Date - Nov 09 , 2026 | 11:29 PM