Share News

ట్రెక్కింగ్‌ టూరిజానికి అడుగులు

ABN , Publish Date - May 01 , 2026 | 11:12 PM

ప్రకృతి అందాలకు నిలయమైన అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్‌ టూరిజం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

ట్రెక్కింగ్‌ టూరిజానికి అడుగులు
హుకుంపేట మండలం అరమ కొండపై ట్రెక్కింగ్‌ చేస్తున్న సాహసికులు(ఫైల్‌)

మన్యంలో ట్రెక్కింగ్‌ అభివృద్ధికి సన్నాహాలు

వారాంతపు సెలవుల్లో ఇప్పటికే ఔత్సాహికులు

గాలికొండ, అరమ కొండల్లో ట్రెక్కింగ్‌

మే 24 నుంచి 31 వరకు ఎన్‌సీసీ క్యాంప్‌

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

ప్రకృతి అందాలకు నిలయమైన అల్లూరి జిల్లాలో ట్రెక్కింగ్‌ టూరిజం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా అరకులోయ కేంద్రంగా ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎన్‌సీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంప్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వాస్తవానికి అరకులోయ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొండలు కోనలున్న అరకులోయ ప్రాంతంలో పర్యాటకంలో భాగంగా ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి కృషి చేస్తామని గత ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాలల్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్వయంగా ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో అరకులోయలో ట్రెక్కింగ్‌ టూరిజం గురించి ప్రస్తావించడం గర్వకారణం.

సాహస క్రీడల అభివృద్ధికి దోహదం

మన్యంలో ఇన్నాళ్లుగా ప్రకృతి అందాలపైనే ఆధారపడి పర్యాటకం కొనసాగుతున్నది. కాని ఇకపై ఇక్కడున్న కొండలు, కోనలను సైతం సందర్శకులకు సరికొత్తగా చూపించి పర్యాటకంగా అభివృద్ధికి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ట్రెక్కింగ్‌ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఏజెన్సీలో అరకులోయ మండలం గాలికొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో, హుకుంపేట మండలం అరమకొండ (సీతమ్మకొండ) ప్రాంతానికి వివిధ ప్రాంతాలకు చెందిన వారు ట్రెక్కింగ్‌ అనుభూతిని పొందుతున్నారు. అయితే పర్యాటకుల వ్యక్తిగత ఆసక్తి మేరకు మాత్రమే ఇన్నాళ్లుగా ఏజెన్సీలో ట్రెక్కింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి, ఉపాధి, ఆదాయం వంటివి లేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అరకులోయ కేంద్రంగా ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు ముందుకు వస్తుండడంతో రానున్న రోజుల్లో అరకులోయ ప్రాంతం సాహస క్రీడలకు వేదికగా మారేందుకు అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

ఈనెల 24 నుంచి రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంప్‌

జిల్లాలో అరకులోయ కేంద్రంగా ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎస్‌సీసీ 13వ బెటాలియిన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంప్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అరకులోయలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ భూమికగా అరకులోయ మండలంలోని గాలికొండ, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లోని అరమ కొండ(సీతమ్మకొండ), అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఔత్సాహిక ఎన్‌సీసీ క్యాడెట్‌లతో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

Updated Date - May 01 , 2026 | 11:12 PM