Share News

కొండ గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:21 PM

మన్యంలోని కొండలపై గల గ్రామాలలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు.

కొండ గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు
పోకలపాలెం పాఠశాల రికార్డులు తనిఖీ చేస్తున్న బొజ్జిరెడ్డి

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి

బూదరాళ్ల పంచాయతీలో పలు పాఠశాలల పరిశీలన

బాలరేవుల పాఠశాల భవనాన్ని తక్షణమే మరమ్మతులు చేయండి

గొరెల్రమెట్టలో అంగన్‌వాడీ భవనం మంజూరుకు హామీ

కొయ్యూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని కొండలపై గల గ్రామాలలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని బూదరాళ్ల పంచాయతీలో బాలరేవుల, జువ్విరేవుల, పోకలపాలెం, గోధుమలంక, గొర్రెలమెట్ట తదితర గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా గొర్రెలమెట్టలో పాఠశాల భవనం శిథిలం కావడంతో చర్చిలో నిర్వహిస్తున్న పాఠశాలను పరిశీలించారు. అనంతరం గరిమండ, జువ్విరేవుల, బాలరేవుల పాఠశాలలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విద్యాబోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన బాలరేవుల పాఠశాల భవనంలో విద్యాబోధన జరగడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భవన మరమ్మతులు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించనున్నట్టు తెలిపారు. గొరెల్రమెట్టలో 48 మంది చిన్నారులతో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నా.. భవన సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. తక్షణమే భవనం మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గరిమండలో 48 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు విద్యాబోధన జరుపుతుండడంతో అదనంగా మరో టీచర్‌ను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవో సింహాచలంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గొర్రెలమెట్టలో పీఎం జన్‌మన్‌ గృహనిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోవడంపై సంబంధిత సిబ్బందిని ఆరా తీశారు. పంచాయతీ పరిధిలో జరుగుతున్న 16 రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత లోపం లేకుండా సకాలంలో పూర్తి చేయించాలని జేఈని ఆదేశించారు. మండల పర్యటనకు వచ్చిన ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జిరెడ్డిని కాకరపాడులో తహశీల్దారు ప్రసాద్‌బాబు, ఎంపీడీవో ప్రసాదరావు, ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం వనవాసీ కల్యాణ ఆశ్రమం, బీజేపీ నేతలతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న తీరుపై గ్రామస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్‌, పాడేరు ఏఎంసీ చైర్‌పర్సన్‌ మంగతల్లి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, మహిళమోర్చా కార్యదర్శి గౌరీ పార్వతి, వనవాసీ ప్రతినిధులు ప్రసాద్‌, బీజేపీ నేతలు చక్రరావు, పద్మరాజు, గృహనిర్మాణ, విద్య, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 11:21 PM