Share News

అడ్వంచర్‌ టూరిజానికి అడుగులు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:12 PM

ఆంధ్రా ఊటీగా పేరుగాంచి పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయ ప్రాంతం అడ్వెంచర్‌ టూరిజంలోనూ అభివృద్ధి చెందనుంది. ఈ ఏడాది అరకు ఉత్సవ్‌లో భాగంగా డిసెంబరు నెలలో ‘అరకు వ్యాలీ అల్ర్టా ట్రయిల్‌ రన్‌- 2027’ పేరిట వంద కిలోమీటర్ల మారఽథన్‌ను నిర్వహించాలని శాప్‌ నిర్ణయించింది. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ, టూరిజం, అటవీ శాఖ, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

అడ్వంచర్‌ టూరిజానికి అడుగులు
సాహస క్రీడలకు అనువైన మన్యంలోని కొండలు, కోనలు

ఈ ఏడాది అరకు ఉత్సవ్‌లో అలా్ట్ర ట్రయిల్‌ రన్‌ నిర్వహణకు శాప్‌ సన్నాహాలు

బ్రాండ్‌ అంబాసిడర్లుగా క్రీడాకారులు పీవీ.సింధు, జ్యోతి యర్రాజీ

ఈ రన్‌తో అంతర్జాతీయ స్థాయిలో అల్లూరి జిల్లాకు గుర్తింపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

కొండలు, కోనలున్న అరకులోయ, అనంతగిరి ప్రాంతంలో ట్రెక్కింగ్‌ ట్రయిల్స్‌ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంపింగ్‌ను అరకులోయలో నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరకు వ్యాలీలో అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.భరణి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించే అరకు ఉత్సవ్‌లో ‘అరకు వ్యాలీ అల్ర్టా ట్రయిల్‌ రన్‌- 2027’ పేరిట 46 గంటలు సమయం పట్టే వంద కిలోమీటర్ల మారఽథన్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ, టూరిజం, అటవీ శాఖ, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఈ మారథన్‌ చేపడతామని స్పష్టత ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ క్రీడాకారులు పీవీ.సింధు, జ్యోతి యర్రాజీ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. అరకు అలా్ట్ర ట్రయిల్‌ రన్‌పై ఈనెల నుంచి విస్తృతంగా ప్రచారం చేపట్టి, జాతీయ, అంతర్జాతీయ సాహసీకులను ఆకర్షించాలని స్పోర్ట్స్‌ అఽథారిటీ అధికారులు భావిస్తున్నారు.

అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధికి సాహస క్రీడలు దోహదం

మన్యంలో ఇన్నాళ్లుగా ప్రకృతి అందాలపైనే ఆధారపడి పర్యాటకం కొనసాగుతున్నది. కాని రానున్న రోజుల్లో సాహస క్రీడలకు స్థానం కల్పించి అడ్వెంచర్‌ టూరిజం అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి అందాలు, కొండలు, కోనలు, జలపాతాలను సాహస ప్రియులకు సరికొత్తగా చూపిస్తూ పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏజెన్సీలో ఇప్పటికే అరకులోయ మండలం గాలికొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో, హుకుంపేట మండలం అరమకొండ(సీతమ్మకొండ) ప్రాంతానికి వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు విచ్చేసి ట్రెక్కింగ్‌ అనుభూతిని పొందుతున్నారు. అయితే వారంతా వారి వ్యక్తిగత ఆసక్తి మేరకు మాత్రమే ఇన్నాళ్లుగా ఏజెన్సీలో ట్రెక్కింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి, ఉపాధి, ఆదాయం వచ్చే లేదు. కాని శాప్‌ అధికారుల ప్రణాళిక ప్రకారం అరకులోయ అలా్ట్ర ట్రయిల్‌ రన్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ సాహస క్రీడాకారులు ఇక్కడకు విచ్చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో రానున్న రోజుల్లో అరకులోయ ప్రాంతం సాహస క్రీడలకు వేదికగా మారేందుకు అవకాశాలున్నాయని పర్యాటకులు, క్రీడాకారులు అంటున్నారు.

మే నెలలో ఎన్‌సీసీ రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంప్‌

జిల్లాలో అరకులోయ కేంద్రంగా సాహస క్రీడలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతోనే ఈ ఏడాది మే నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎస్‌సీసీ 13వ బెటాలియిన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌ క్యాంప్‌ను నిర్వహించారు. అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ భూమికగా అరకులోయ మండలంలోని గాలికొండ, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లోని అరమ కొండ(సీతమ్మకొండ), అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ క్యాంప్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఎన్‌సీసీ క్యాడెట్‌లు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:12 PM