అరకు కౌనికి ప్రపంచ ఖ్యాతికి చర్యలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:39 PM
అరకు కాఫీకి ఎంత ఖ్యాతి వచ్చిందో అరకు కౌనికి (అరకు డిష్) అంతే ప్రాచుర్యం తెచ్చేలా అరకు ఉత్సవ్-2026తో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి, అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
అన్ని రెస్టారెంట్లలో చిరుధాన్యాలతో డిష్, స్నాక్స్
అరకు కాఫీలా ప్రాచుర్యం వచ్చేందుకు కృషి
రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గిరిజన తెగల గుర్తింపునకు రిసెర్చ్
రూ.వందల కోట్లతో మారుమూల గ్రామాలకు రహదారులు
అరకులోయ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అరకు కాఫీకి ఎంత ఖ్యాతి వచ్చిందో అరకు కౌనికి (అరకు డిష్) అంతే ప్రాచుర్యం తెచ్చేలా అరకు ఉత్సవ్-2026తో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి, అల్లూరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం అంజోడ ఫైనరీలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి, జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్, కలెక్టర్ ఏఎస్‌దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఇకపై అరకుకౌని అన్ని రెస్టారెంట్స్‌లో అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చిరుధాన్యాలు, ఇతర పోషక విలువలున్న మిల్లెట్స్‌తో అరకుకౌని తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఒకప్పడు రాగులతో చేసిన అంబలి, బొన్న జావను తింటున్నామంటే కొంత నామోషిగా భావించేవారని, అన్నంకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్‌లు ప్రతి ఒక్కరికి వస్తున్న నేపథ్యంలో చిరుధాన్యాలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో సవర, వర్ల తెగలకు గుర్తింపు ఉందని, ఈ ప్రాంత గిరిజన తెగలకు గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రవిశ్వవిద్యాలయానికి చెందిన రిటైర్డు ప్రొఫెసర్లు, ఫైన్ ఆర్ట్స్ నిపుణులతో పరిశోధనలు చేయించి, మూడు నెలల్లో నివేదిక తెప్పిస్తామన్నారు. ఆగస్టు 9వ తేదీ అంతర్జాతీయ గిరిజన దినోత్సవం నాటికి ప్రత్యేక ఆర్ట్ ఫాంను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గిరిజనుల జీవనోపాధి పెంచేందుకు హోంస్టే పాలనీని అమలులోకి తీసుకువచ్చామన్నారు. హోం స్టేలతో పాటు అరకు డిష్, అరకు కాఫీ వంటి వాటితో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఏజెన్సీలో రహదారుల అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.500 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటితోపాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖా ద్వారా రూ.వెయ్యి కోట్లతో మారుమూల ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. డోలీ రహిత గిరిజన ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జాడే లేదని, అధికారం కోల్పోయిన తర్వాత విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక్క మారుమూల గిరిజన గ్రామానికి కూడా రహదారి వేయలేదన్నారు. అరకు ఉత్సవ్‌తో గిరిజన ప్రాంతం, గిరిజనుల జీవన విధానం ఎంతగానో దోహదం చేసిందన్నారు.