జీడిమామిడికి స్టెమ్ బోరర్ బెడద
ABN , Publish Date - May 25 , 2026 | 11:54 PM
మండలంలోని జీడిమామిడి తోటలకు స్టెమ్ బోరర్ (నియోప్లోకేడెరస్) బెడద ఎక్కువగా ఉంది. చెట్టు కాండాన్ని తొలిచే స్టెమ్ బోరర్ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మండలంలో దాదాపు అన్ని తోటలకు వ్యాపించిన పురుగు
నాశనమవుతున్న చెట్లు
దిక్కుతోచని స్థితిలో రైతులు
పట్టించుకోని ఉద్యానవన శాఖాధికారులు
కొయ్యూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీడిమామిడి తోటలకు స్టెమ్ బోరర్ (నియోప్లోకేడెరస్) బెడద ఎక్కువగా ఉంది. చెట్టు కాండాన్ని తొలిచే స్టెమ్ బోరర్ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎకరానికి ఏడు చెట్లు చొప్పున దాదాపు మండలంలోని అన్ని తోటలకు స్టెమ్ బోరర్ వ్యాపించింది. అత్యంత ప్రమాదకర తెగులు సోకడంతో రానున్న పది సంవత్సరాల్లో జీడిమామిడి సమూలంగా నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉద్యానవన శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
మండల వ్యాప్తంగా సుమారు ఐదు వేల హెక్టార్ల పైబడి జీడిమామిడి సాగవుతోంది. మండలంలో అధిక శాతం రైతులు ఈ తోటలపైనే ఆధారపడ్డారు. అయితే ఇటీవల ఈ తోటలను స్టెమ్ బోరర్ పురుగు ఆశించింది. ఇది జీడిమామిడి చెట్టు కాండం, వేరు భాగాల్లో రంధ్రాలు చేస్తోంది. ఆడ పురుగు అక్కడ గుడ్లు పెట్టడం, దాని నుంచి వచ్చిన పిల్లలు అంతర్గత కణ జాలాలను తినడంతో తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీని వలన ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతున్నాయి. అలాగే చెట్టు నిలువునా ఎండిపోయి చనిపోతున్నాయి. కొన్ని తెగులు సోకిన చెట్లు కొద్దిపాటి గాలి వీచినా సులభంగా విరిగిపోతున్నాయి. పురుగు కాండంలో దాగి ఉండడం వలన రైతులు కేవలం పైపైన మందులు పిచికారీ చేస్తున్నప్పటికీ తెగులు నివారణ జరగడం లేదు. దీని నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలన్నా తగిన సూచన, సలహాలందించే ఉద్యానశాఖ సిబ్బంది అందుబాటులో లేక రైతులు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా పురుగులను ఏరి చంపడం, బంక లేదా పొడి కనిపించిన చెట్లు బెరడును కత్తి, లేదా ఉలి వంటి సాధనాలతో దొలిచి లోపల ఉన్న లార్వా(పురుగులను) బయటకు తీసి కాలుస్తున్నారు. అలాగే సన్నని ఇనుప తీగ ఉపయోగించి రంధ్రాల్లోకి పోనిచ్చి లోపల ఉన్న పురుగును పొడిచి చంపుతున్నారు. నైలాన్ బ్రష్‌లతో భూమి నుంచి సుమారు రెండు మీటర్లు మేర చెట్టు కాండాన్ని గీకుతూ గుడ్లను నాశనం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ తెగులు ప్రభావం రోజు, రోజుకు తీవ్రమవుతూ పక్క తోటలకు సోకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఉద్యానవన శాఖాధికారులు స్పందించి స్టెమ్ బోరర్ నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.