Share News

ఉక్కు సంకల్పం

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:28 AM

జిల్లా పారిశ్రామిక రంగంలో నూతన శకం ఆవిష్కృతం కానున్నది. ఇందుకు నక్కపల్లి మండలం వేదిక కానుంది.

ఉక్కు సంకల్పం

జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో మైలురాయి

నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో భారీ స్టీల్‌ప్లాంటు

రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌

రెండు దశల్లో నిర్మాణం, 65 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబునాయుడు

హాజరుకానున్న పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

నక్కపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పారిశ్రామిక రంగంలో నూతన శకం ఆవిష్కృతం కానున్నది. ఇందుకు నక్కపల్లి మండలం వేదిక కానుంది. ఉక్కు ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు సంయుక్తంగా ‘ఏఎం/ఎన్‌ఎస్‌ ఇండియా’ పేరుతో భారీ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఉక్కు ఫ్యాక్టరీకి సోమవారం సాయంత్రం నక్కపల్లి మండలం పాటిమీద గ్రామం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

స్టీల్‌ప్లాంటు కోసం ప్రభుత్వం 2,164 ఎకరాలను కేటాయించింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయితే ప్రత్యేక్షంగా, పరోక్షంగా సుమారు 65 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలుచేపట్టారు. శంకుస్థాపన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తిచేశారు. సీఎంతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులయ్యేందుకు సభావేదికను విశాలంగా నిర్మించారు.

రాష్ర్టానికే తలమానికం: మంత్రి రవీంద్ర

ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు సంయుక్తంగా నక్కపల్లి మండలంలో నిర్మించనున్న భారీ ఉక్కు పరిశ్రమ రాష్ర్టానికే తలమానికంగా నిలుస్తుందని, రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చివేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఇక్కడ హోం మంత్రి అనితతో కలిసి సీఎం పర్యటన, సభా ఏర్పాట్లను పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు. వీరి వెంట ఎంపీ సీఎం రమేశ్‌, కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌, జేసీ శౌర్యమన్‌ పటేల్‌, తదితరులు వున్నారు.

పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాక...

అనకాపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు మంత్రులు జిల్లాకు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పౌరవిమానాయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, కొల్లు రవీంంద్ర, వంగలపూడి అనిత, టీజీ భరత్‌, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి, తదితరులు హాజరుకానున్నారు.

సీఎం చంద్రబాబు టూర్‌ షెడ్యూల్‌

అనకాపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయలతో ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ ఇండియా’ ఉక్కు ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు నక్కపల్లి మండలం చందనాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.35 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 3.40 గంటలకు స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ జరిగే స్థలానికి చేరుకుంటారు. 3.55 గంటల వరకు ప్లాంట్‌ ఏర్పాటు స్థలాన్ని, బ్లూప్రింట్‌లను పరిశీలిస్తారు. కొద్దిసేపు మంత్రులు, స్టీలప్లాంట్‌ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం సభా వేదికపైకి చేరుకొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.28 గంటలకు స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకొని 5.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 7.10 గంటలకు విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకుంటారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ టూర్‌ షెడ్యూల్‌

నక్కపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన వివరాలను అధికారులు ఆదివారం విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రవ్యేక విమానంలో బయలుదేరి 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ చేరుకుంటారు. 5.30 గంటల వరకు సీఎం చంద్రబాబుతో కలిసి స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొంటారు. 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి విమానంలో విజయవాడ (గన్నవరం) వెళతారు.

‘ఉక్కు’ శంకుస్థాపనను విజయవంతం చేయండి

హోం మంత్రి అనిత

అనకాపల్లి టౌన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ఇండియా ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆదివారం నూకాంబిక ఆలయం వద్ద ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. స్టీల్‌ప్లాట్‌ ఏర్పాటుతో జిల్లాలో వేలాది మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐదేళ్ల కూటమి పాలనలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, బత్తుల తాతయ్యబాబు, బుద్ద నాగజగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పటిష్ఠ పోలీసు బందోబస్తు

ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సోమవారం జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, సాధారణ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలు వివిధ రకాల వాహనాల్లో వస్తారని, ఈ వాహనాలన్నీ కాగితా జంక్షన్‌ మీదుగా కేటాయించిన పార్కింగ్‌ ప్రదేశాలకు చేరుకోవాలని సూచించారు. వీఐపీ పాస్‌లు వున్న వారు మాత్రమే ఉపమాక జంక్షన్‌ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 01:28 AM