ఉక్కు కార్మికుల సమ్మె రేపు
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:52 AM
స్టీల్‌ప్లాంటు కార్మికులు గురువారం సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నారు.
సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్టు అఖిలపక్షం ప్రకటన
విధులకు నాన్ ఎగ్జిక్యూటివ్‌లు, కాంట్రాక్టు కార్మికులు దూరం
అధికారులకు 12 గంటల చొప్పున విధులు
ఉక్కుటౌన్‌షిప్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటు కార్మికులు గురువారం సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కార్మికవర్గం డిమాండ్ చేస్తోంది. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్లాంటులో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగులు, మరో తొమ్మిది వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఒకేసారి అంతా సమ్మె చేయనున్న నేపథ్యంలో యాజమాన్యం ప్రత్యామ్నాయంపై ప్రణాళిక సిద్ధం చేసింది. సమ్మె విరమించుకోవాలని ముందుగా కార్మిక సంఘాలను కోరింది. దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నామని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో ఎగ్జిక్యూటివ్‌లంతా 12 గంటల చొప్పున విధులు నిర్వర్తించాలని ఆదేశించింది.
కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవి..
- ఉత్పత్తి ఆధారిత వేతనాలపై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
- పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు చెల్లించాలి
- నిలిపివేసిన హెచ్‌ఆర్‌ఏ, ఈఎల్ పునరుద్ధరించాలి
- టౌన్‌షిప్ క్వార్టర్స్‌లో నివాసితులకు విద్యుత్ చార్జీలు తగ్గించాలి
- కార్మికులకు 15 సీఎల్స్ ఇవ్వాలి
- గ్రాట్యుటీ రూ.25 లక్షలకు పెంచాలి
- స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలి
- ఈవోఐ టెండర్లను రద్దుచేయాలి
- తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
నిర్వాసిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి
అధికారులకు 12 గంటల డ్యూటీ
నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడంతో అధికారులు గురువారం 12 గంటల చొప్పున విధులు నిర్వహించాలని ఉక్కు యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక షిఫ్ట్, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మరో షిఫ్ట్‌గా ప్రకటించింది. ముఖ్యమైన విభాగాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆర్‌ఐఎన్‌ఎల్ పర్సనల్ డైర్‌క్టర్‌గా రాకేశ్ నందన్ సాహే బాధ్యతల స్వీకారం
విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్-విశాఖ ఉక్కు) పర్సనల్ డైరెక్టర్‌గా రాకేశ్ నందన్ సాహే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మానవ వనరుల విభాగంలో 29 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన ఎన్‌టీపీసీ, దానితో జాయింట్ వెంచర్ కలిగిన ఐఓసీ, సీఐఎల్‌లలో పనిచేశారు. థర్మల్, హైడ్రో, గ్యాస్, మైనింగ్ రంగాల్లో విశేష అనుభవం సాధించారు. నేషనల్ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఆయన జీవితకాల సభ్యునిగా గుర్తింపు పొందారు.