ఉక్కు రికార్డు
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:20 AM
ఉక్కు కర్మాగారం ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది.
జనవరిలో 4.31 లక్షల టన్నుల విక్రయం
రూ.2,278 కోట్ల ఆదాయం
బకాయిలతో కలిపి రూ.2,668 కోట్లు రాక
జీతాలు మాత్రం ఉత్పత్తి ఆధారంగానే...!
పెన్షనర్లకు అదే విధానంపై ఆవేదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉక్కు కర్మాగారం ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 4.31 లక్షల టన్నుల స్టీల్‌ను విక్రయించి రూ.2,278 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఒక్క నెలలోనే రూ.2,668 కోట్లు వసూలైంది. ఇది అమ్మకాల కంటే అధికంగా ఉండడం గమనార్హం. పాత బకాయిలను కూడా అధికారులు రాబట్టారు. ఇదంతా పరిమిత మానవ వనరులు...అంటే తగ్గించిన ఉద్యోగులతోనే సాధించడం విశేషం. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటులో 9,245 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎగ్జిక్యూటివ్‌లు 2,775 మంది కాగా, మిగిలిన 9,245 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు.
ఇంకా ఉత్పత్తి ఆధారంగానే జీతాలు
గత నవంబరు నెల నుంచి స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా జీతాలను ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఉద్యోగ సంఘాలు ఖండించినా, ఢిల్లీ అధికారులు ఈ విధానం తగదని హెచ్చరించినా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. జనవరి నెల జీతాలను సైతం ఉత్పత్తి నిష్పత్తిలో సోమవారం జమ చేసింది. ఆఖరుకు వితంతువు పెన్షన్లలోను ఇదే విధానం అమలు చేయడంతో వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కులో ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే, ఆ కుటుంబానికి వచ్చే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ మొత్తం యాజమాన్యం వద్ద డిపాజిట్ చేస్తే...ఆ ఉద్యోగి వయస్సు 60కి చేరే వరకూ ప్రతి నెలా బేసిక్ పే, డీఏ కలిపి పెన్షన్ కింద ఆ కుటుంబానికి ఇస్తారు. ఈ విధంగా సుమారు 700 మంది దాదాపు రూ.200 కోట్లు యాజమాన్యం వద్ద ఉంచారు. వారికి ప్లాంటు ఉత్పత్తితో సంబంధమే లేదు. అయినా సరే యాజమాన్యం వారందరికీ ఉత్పత్తి తగ్గిందంటూ పెన్షన్లలో కోత పెడుతోంది. వీరికి ఇచ్చే మొత్తం నెలకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే. పెన్షన్ ఆదాయం చూసుకునే తాము పిల్లలను చదివించుకుంటున్నామని, ఈఎంఐలు పెట్టుకున్నామని, ఇప్పుడు ఆ మొత్తం తగ్గించేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారంతా వాపోతున్నారు.
ఏసీబీ వలలో సచివాలయ అడ్మిన్
భర్త పేరిట ఉన్న ఇంటి పన్నును భార్య పేరున మార్చేందుకు రూ.16 వేలు డిమాండ్
లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం
గాజువాక, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
భర్త పేరిట ఉన్న ఇంటి పన్నును భార్య పేరున మార్చేందుకు లంచం తీసుకుంటూ గాజువాక నెహ్రూనగర్‌లోని సచివాలయ అడ్మిన్ సోమవారం ఏసీబీ అధికారులకు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్‌పీ హర్షిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక పైడిమాంబ కాలనీకి చెందిన పల్లా సత్తిబాబు తాను చాలాకాలం కిందట నిర్మించుకున్న షెడ్డుకు సంబంధించి ఇంటి, నీటి పన్నులను జీవీఎంసీకి చెల్లిస్తున్నారు. కాగా ఇటీవల ప్రభుత్వం ఆ షెడ్డు ఉన్న స్థలాన్ని క్రమబద్ధీకరించి అతడి భార్య పేరిట పట్టా ఇచ్చింది. దీంతో తన పేరు మీద ఉన్న ఇంటి పన్నును తన భార్య పేరున మార్చాల్సిందిగా సత్తిబాబు నెహ్రూనగర్ సచివాలయం అడ్మిన్ గణేష్‌ను సంప్రతించారు. ఇందుకు రూ.25 వేలు లంచం ఇవ్వాలని గణేశ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గణేష్‌కు సత్తిబాబు తొలివిడతగా తొమ్మిది వేల రూపాయలు ఇచ్చారు. మరో 16 వేల రూపాయలు ఇస్తే గానీ పనిచేసేది లేదని గణేష్ మొండికేశాడు. దీంతో విసుగు చెందిన పల్లా సత్తిబాబు ఏబీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్‌పీ హర్షిత తమ సిబ్బందితో సోమవారం సాయంత్రం నెహ్రూనగర్‌లోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. పల్లా సత్తిబాబు నుంచి అడ్మిన్ గణేష్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, అరెస్టు చేశారు. మంగళవారం ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నట్టు డీఎస్‌పీ తెలిపారు.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు
అందుకే ముందుగానే పరీక్షలు
వచ్చే నెల 2 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహణ
ఆ తరువాత టెన్త్ సిలబస్ బోధన
ప్రైవేటుకు దీటుగా ఫలితాల సాధనకు పాఠశాల విద్యా శాఖ యత్నం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులను ముందుగానే పదో తరగతి కోసం సన్నద్ధం చేసే దిశగా విద్యా శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది ముందుగానే వార్షిక పరీక్షలు (ఎస్‌ఏ-2) నిర్వహించనున్నది. ఆ తరువాత బ్రిడ్జి కోర్సు పేరిట పదో తరగతి సిలబస్ బోధించనున్నారు. వేసవి సెలవులు ప్రారంభమయ్యే ఏప్రిల్ 23వ తేదీకల్లా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పించడం, ఆంగ్లం, గణితం, సైన్స్‌లో కొంతమేర సిలబస్ పూర్తిచేయడం...లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది.
ఏటా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం తరువాత చాప్టర్ల వారీగా పాఠ్యాంశాల బోధన చేసేవారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు పదో తరగతి సిలబస్ బోధనలో ముందుంటాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతిలో ప్రవేశించిన మూడు నెలల తరువాత టెన్త్ సిలబస్ బోధిస్తుంటాయి. తొమ్మిదో తరగతి పూర్తయి...పదో తరగతికి వచ్చేసరికి టెన్త్ క్లాస్ సిలబస్ పూర్తిచేసేస్తాయి. ఆ తరువాత పదేపదే రివిజన్ చేస్తూ వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తాయి. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ముందంజలో ఉంటున్నారని పాఠశాల విద్యా శాఖ గుర్తించింది. ఈ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో జరగాల్సిన తొమ్మిదో తరగతి వార్షిక పరీక్షలు ఈసారి మార్చి 2 నుంచి 12వ తేదీ వరకూ జరుపుతారు. వచ్చే నెల 13 నుంచి ఏప్రిల్ 23 వరకు టెన్త్ సిలబస్‌పై సందేహాలు, పరీక్షల విధానంపై అవగాహన, ప్రధాన సబ్జెక్టులలో కొన్ని పాఠ్యాంశాల బోధన చేస్తారు. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి బోధించే టీచర్లకు అప్రమత్తం చేశారు. తొమ్మిదో తరగతి సిలబస్ నెలాఖరుకు పూర్తిచేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పది వేల మంది తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వారికి బ్రిడ్జి కోర్సు బోఽధించే సమయంలో టెన్త్ పుస్తకాలు అందిస్తే సబ్జెక్టుపై అవగాహన పెరిగి చదువుకునేందుకు వీలుంటుందని ప్రధానోపాధ్యాయులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందుగానే పదో తరగతి పుస్తకాలు అందించాలని జిల్లా విద్యా శాఖకు ప్రతిపాదించారు.
సింహాచలం దేవస్థానం ఈఓగా కాకినాడ డీఆర్‌ఓ?
నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు
చందనోత్సవం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా కాకినాడ జిల్లా రెవెన్యూ అఽదికారి (డీఆర్‌ఓ) జె.వెంకటరావు నియమితులు కానున్నట్టు తెలిసింది. నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చునంటున్నారు. ప్రస్తుతం ఆలయ ఇన్‌చార్జి ఈఓగా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత వ్యవహరిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20న చందనోత్సవం (అప్పన్న నిజరూప దర్శనం) జరగనుంది. గత ఏడాది ఈ ఉత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. అప్పుడు ఈఓ త్రినాథ్ సెలవులో ఉండడంతో ఇంకో అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణాలపై అవగాహన లేకపోవడంతో రాత్రికి రాత్రి నిర్మించిన గోడ వర్షానికి కూలిపోయి ప్రమాదం జరిగింది. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు చందనోత్సవానికి ముందే పూర్తిస్థాయి ఈఓను నియమించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దేవదాయ శాఖాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై కాకినాడ డీఆర్‌ఓ వెంకటరావును నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఫైల్ ప్రభుత్వం ఉందని, సంతకాలు కాగానే ఆయన వచ్చి విధుల్లో చేరతారని దేవస్థానం వర్గాలు తెలిపాయి.