Share News

పుంజుకున్న ఉక్కు

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:09 AM

విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ పుంజుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు కొనలేని దుస్థితిలో చాలాకాలం కొట్టుమిట్టాడిన కర్మాగారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సాయం చేయడానికి ముందుకువచ్చాయి.

పుంజుకున్న ఉక్కు

అంతక్రితం ఏడాదితో పోల్చితే 2025-26 సంవత్సరంలో ఉత్పత్తి, ఆదాయంలో వృద్ధి

రూ.22 వేల కోట్లు దాటిన విక్రయాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ పుంజుకుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు కొనలేని దుస్థితిలో చాలాకాలం కొట్టుమిట్టాడిన కర్మాగారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సాయం చేయడానికి ముందుకువచ్చాయి. కేంద్రం రూ.11,440 కోట్లు, రాష్ట్రం రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించాయి. దాంతో యాజమాన్యం ముడిపదార్థాలు సమకూర్చుకుంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను పునఃప్రారంభించింది. మరోవైపు సంస్కరణల పేరిట ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. రెండు విడతలుగా వీఆర్‌ఎస్‌ను అమలు చేసి 1,500 మందిని ఇంటికి పంపించేశారు. ఉన్నవారికి ఉత్పత్తి ఆధారిత వేతనాలు ఇస్తున్నారు. అలాగే 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ఇన్ని కష్టాలు ఎదురైనా సరే ఉద్యోగులంతా 2025-26 ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం ఇచ్చిన లక్ష్యాన్ని సాధించడానికి శ్రమించారు. 95 శాతానికి పైగా ఉత్పత్తి సామర్థ్యం సాధించారు. దాంతో ఉక్కు కర్మాగారం గత ఏడాది కంటే మెరుగైన పనితీరు కనిపించింది. దీనిని ఇటీవల వచ్చిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా మెచ్చుకొని ఇదే బాటలో మరింత ముందుకు సాగాలని, నష్టాల నుంచి లాభాల్లోకి వస్తామని స్పష్టంచేశారు.

ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22,311 కోట్ల ఉత్పత్తులు విక్రయించింది. గత ఏడాది అమ్మకాలు (రూ.18,288 కోట్లు)తో పోల్చుకుంటే 22 శాతం వృద్ధి నమోదైంది. 2024-25లో 3.49 మిలియన్‌ టన్నుల ఉత్పత్తులు విక్రయించగా, 2025-26లో 4.42 మిలియన్‌ టన్నులు (27 శాతం వృద్ధి) విక్రయించింది. ఉత్పత్తి విషయానికి వస్తే 204-25లో 3.91 మిలియన్‌ టన్నుల హాట్‌మెటల్‌ రాగా 2025-26లో ఇది 5.95 మిలియన్‌ టన్నుల (52 శాతం వృద్ధి)కు చేరింది. లిక్విడ్‌ స్టీల్‌ ఉత్పత్తి 3.75 మిలియన్‌ టన్నుల నుంచి 5.69 మిలియన్‌ టన్నులకు, క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తి 3.58 మిలియన్‌ టన్నుల నుంచి 5.43 మిలియన్‌ టన్నులకు పెరిగింది. పటిష్ఠమైన ప్రణాళిక, మెరుగైన పనితీరు, పెరిగిన సామర్థ్య వినియోగం, ఉద్యోగుల నిరంతర కృషివల్లనే ఇది సాధ్యమైందని ఉక్కు యాజమాన్యం వెల్లడించింది.

విశాఖ ఉక్కు గత మూడేళ్ల అమ్మకాలు

-----------------------------------------------------------------------------------------

కాలం 2025-26 2024-25 2023-24

-------------------------------------------------------------------------------------------

తొలి త్రైమాసికం రూ.4,879 కోట్లు రూ.4,407 కోట్లు రూ.5,290 కోట్లు

ద్వితీయ త్రైమాసికం రూ.5,424 కోట్లు రూ.4,316 కోట్లు రూ.6,349 కోట్లు

తృతీయ త్రైమాసికం రూ.5,452 కోట్లు రూ.3,842 కోట్లు రూ.5,126 కోట్లు

ఆఖరి త్రైమాసికం రూ.6,813 కోట్లు రూ.6,010 కోట్లు రూ.6,363 కోట్లు

-------------------------------------------------------------------------------------------

మొత్తం రూ.22,568 కోట్లు రూ.18,576 కోట్లు రూ.23,129 కోట్లు

------------------------------------------------------------------------------------------------

Updated Date - Apr 05 , 2026 | 12:09 AM