ఉక్కురిబిక్కిరి
ABN , Publish Date - May 15 , 2026 | 01:34 AM
స్టీల్‌ప్లాంటులో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఉన్నతాధికారులు ఉద్యోగుల పని గంటలు పెంచేస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీని 12 గంటలు చేస్తున్నారు. దాని వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. ఇంతా కష్టపడితే నెల వచ్చేసరికి 100 శాతం జీతాలు ఇవ్వడం లేదు. లక్ష్యంలో ఎంత పనిచేశారో చూసి దాని ప్రకారం ఇస్తున్నారు. గత ఏడాది చివరి నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు.
స్టీల్‌ప్లాంటులో ఉద్యోగులకు
మళ్లీ 12 గంటల డ్యూటీ
ఉదయం నుంచి 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ,
రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకూ షిఫ్ట్‌లు
జీతాలు మాత్రం ఉత్పత్తి ఆధారంగా చెల్లింపు
కనీసం క్యాంటీన్ల సదుపాయం కూడా సరిగా లేదని ఉద్యోగుల ఆవేదన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్‌ప్లాంటులో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఉన్నతాధికారులు ఉద్యోగుల పని గంటలు పెంచేస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీని 12 గంటలు చేస్తున్నారు. దాని వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. ఇంతా కష్టపడితే నెల వచ్చేసరికి 100 శాతం జీతాలు ఇవ్వడం లేదు. లక్ష్యంలో ఎంత పనిచేశారో చూసి దాని ప్రకారం ఇస్తున్నారు. గత ఏడాది చివరి నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి ఒక్క నెల కూడా ఎవరికీ 100 శాతం జీతాలు రాలేదు. పైగా అంతకు ముందు ఆర్థిక ఇబ్బందులని ఉద్యోగులకు బకాయి పెట్టిన జీతాలు 300 శాతానికి పైగా ఇంకా చెల్లించనే లేదు. సగటున ఒక్కో ఉద్యోగికి మూడు నెలల జీతం రావలసి ఉంది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు.
ఉన్నత స్థానాల్లో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టగానే మళ్లీ ఇలా 12 గంటల డ్యూటీ వేయడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక షిఫ్ట్, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మరో షిఫ్ట్ ఖరారు చేస్తూ బుధవారం నుంచే అమలు చేస్తున్నారు. ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉందని, ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టుగా అందించలేకపోతున్నారని ఉద్యోగ వర్గాలు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లాయి.
క్యాంటీన్లు ఎక్కడ?
గత సీఎండీ సక్సేనా హయాంలో స్టీల్‌ప్లాంటులో దాదాపు 150కి పైగా ఉన్న ప్రైవేటు క్యాంటీన్లను మూసివేశారు. అధికారిక క్యాంటీన్లు 3 నుంచి 4 కి.మీ దూరంలో పరిమితంగా వేళ్లపై లెక్క పెట్టగలిగే సంఖ్యలోనే ఉన్నాయి. ఉదయం 8 గంటలకు క్యారియర్ పట్టుకొని వచ్చే ఉద్యోగి మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రాత్రి 8 గంటల వరకు ప్లాంటులో ఉండాలంటే మధ్య మధ్యలో టీ తాగడానికో, బిస్కెట్లు తినడానికే క్యాంటీన్ ఉండాలి. అవి అందుబాటులో లేవు. అక్కడే ఉద్యోగికి కాసేపు విశ్రాంతి లభిస్తుంది. వాటిని ఏర్పాటు చేయకుండా 12 గంటలు ఏకధాటిగా పనిచేయమంటే ఎలాగని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుత యాజమాన్యం క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలు అద్దెకు ఇచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, ఉద్యోగులు, కార్మికులకు కొంత వెసులుబాటు కలుగుతుందని యూనియన్ల ప్రతినిధులు చెబుతున్నారు.
దారుణంగా మారిన కోక్‌ఓవెన్లు
నిర్వహణ పట్టించుకోని అధికారులు
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో కోక్‌ఓవెన్ బ్యాటరీల పరిస్థితి ఏమీ బాగా లేదు. మొత్తం ఐదు కోక్‌ఓవెన్ బ్యాటరీలు ఉండగా వాటిలో మూడు శిథిలావస్థకు చేరాయి. ఉన్నవాటినే మరమ్మతులు చేసి నడిపిస్తున్నారు. అనుభవం ఉన్న కాంట్రాక్టు సిబ్బందిని తొలగించడంతో వాటి నిర్వహణ కష్టతరంగా మారింది. పైన ఎక్కడెక్కడో పైపులైన్లు పగిలి నీరు బ్యాటరీలపైన పడుతోంది. వాటిని గుర్తించి సరిచేయడానికి చాలా సమయం పడుతోంది. మరోవైపు కోక్‌ఓవెన్లకు అవసరమైన కోక్‌ను లోకో (రైళ్లలో)లో తరలిస్తారు. ఆ రైలుమార్గం కూడా వ్యర్థాలతో నిండిపోయి లోకోలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 100 శాతం పుషింగ్‌లు తీయలేదని ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. సమస్య పరిష్కరించే క్రమంలో కొంత సమయం మరమ్మతులకు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పినా వినిపించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడైనా నిర్వహణ పనులకు తగినంత సిబ్బందిని కేటాయించాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.