Share News

అడ్డంగా దొరికిన ఉక్కు యాజమాన్యం

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:28 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం అడ్డంగా దొరికిపోయింది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, వారి ఆధార్‌ నంబర్ల బ్లాకింగ్‌ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు దీనిపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అలాంటిదేమీ చేయలేదని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఈ అంశంపై స్థానిక నాయకులు చేసిన విజ్ఞప్తులను సైతం నాటి సీఎండీ ఏకే సక్సేనా బుట్టదాఖలు చేశారు.

అడ్డంగా దొరికిన  ఉక్కు యాజమాన్యం

ఏడాది క్రితం 4,500 మంది

కాంట్రాక్టు కార్మికుల ఆధార్‌ బ్లాక్‌

ఉపాధి లేకుండా అడ్డంకులు

కార్మిక నాయకుడి ఫిర్యాదుతో

అటువంటిదేమీ లేదంటూ ఇప్పుడు బుకాయింపు

స్థానిక నాయకులు చెప్పినా పట్టించుకోని నాటి సీఎండీ

విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యం అడ్డంగా దొరికిపోయింది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, వారి ఆధార్‌ నంబర్ల బ్లాకింగ్‌ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించింది. కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు దీనిపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు అలాంటిదేమీ చేయలేదని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. ఈ అంశంపై స్థానిక నాయకులు చేసిన విజ్ఞప్తులను సైతం నాటి సీఎండీ ఏకే సక్సేనా బుట్టదాఖలు చేశారు.

ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కాంట్రాక్టు కార్మికులను కొనసాగించలేమంటూ గత ఏడాది 4,500 మందిని నాటి స్టీల్‌ప్లాంటు సీఎండీ ఏకే సక్సేనా తొలగించారు. అందులో ప్లాంటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా ఉన్నారు. అయితే ఆ వర్కర్లు ప్లాంటులో ఏ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేయకుండా వారి ఆధార్‌ నంబర్లన్నీ బ్లాక్‌ చేశారు. దాంతో వారికి అప్పటి నుంచి ఉపాధి లేకుండాపోయింది. దీనిపై విశాఖ ఎంపీ సూచన మేరకు జిల్లా కలెక్టర్‌ ప్లాంటుకు వెళ్లి సీఎండీతో మాట్లాడారు. నిర్వాసిత కాంట్రాక్టు వర్కర్లను కొనసాగించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా అదే అభ్యర్థన చేశారు. అయితే యాజమాన్యం ఇప్పటివరకూ తొలగించిన కాంట్రాక్టు వర్కర్లకు ఉపాధి కల్పించలేదు. వారి ఆధార్‌ కార్డులను కంప్యూటర్లలో బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించలేదు. దాంతో వారికి ఉపాధి కరవైంది. ఈ అంశంపై కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు ఇటీవల ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రిత్వ శాఖ విశాఖపట్నం ప్లాంటు యాజమాన్యాన్ని వివరణ కోరగా, తాము ఆర్థిక ఇబ్బందుల వల్లనే వారిని తొలగించామని పేర్కొంది. ఎవరి ఆధార్‌ కార్డులు బ్లాక్‌ చేయలేదని పేర్కొంది. తమకు ఏ కాంట్రాక్టు కార్మికుడు ఫిర్యాదు చేయలేదని సమాధానం ఇచ్చింది. అయితే అదంతా అవాస్తవమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం చర్యలను నిరసిస్తూ అప్పట్లో కాంట్రాక్టు కార్మికులు ధర్నాలు చేశారని గుర్తుచేస్తున్నాయి. గత సీఎండీ ఏకే సక్సేనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేకం చేశారని, వాటన్నింటిపై దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు వారికి ఏ న్యాయం చేస్తారో చెప్పాలని కోరుతున్నారు.

Updated Date - Sep 05 , 2026 | 01:28 AM