ఉక్కు ఉద్యోగుల జీతాల్లో కోత!
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:27 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు మాత్రం ఉసూరుమంటూ కాలం గడిపారు.
ఉత్పత్తి ఆధారంగానే వేతనాలు
రిటైరై వెళ్లిపోతూ ఉత్తర్వులు ఇచ్చిన సీఎండీ
డీపీఈ వివరణ కోరినా వెనక్కి తగ్గని వైనం
కార్మికుల ఆందోళన
విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు మాత్రం ఉసూరుమంటూ కాలం గడిపారు. యాజమాన్యం నిర్దేశించిన ప్రకారం 100 శాతం ఉత్పత్తి తీసినా పాత సీఎండీ సక్సేనా ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వకుండా కోత పెట్టారు. అవి కూడా ఒకటో తేదీన ఇవ్వకుండా చేశారు. ఆయన ఎంఓఐఎల్‌లో డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు. అక్కడ వేడుకల కోసం ముందుగానే వెళ్లిపోయారు. నవంబరు నెల మాదిరిగానే డిసెంబరు నెలకు కూడా ఉత్పత్తి ఆధారిత జీతాలే ఇవ్వాలంటూ ఉత్తర్వులు ఇచ్చి వెళ్లిపోయారు. వాస్తవానికి డిసెంబరులో ఉద్యోగులు అనేకసార్లు లక్ష్యానికి మించి ఉత్పత్తి తీశారు. అయితే కొన్ని విభాగాల్లో తగిన వనరులు లేక అందుబాటులో ఉన్నంత మేరకు ఉత్పత్తి సాధించారు. దాంతో ఒక్కో విభాగానికి ఒక్కోలా జీతాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాల్లో పనిచేసే వారికి 96 శాతం ఇస్తున్నారని తెలిసింది. రోలింగ్ మిల్స్‌లో పనిచేసే వారికి 82 శాతమే ఇవ్వడానికి పత్రాలు తయారుచేశారు. నాణ్యమైన కోక్ అందుబాటులో లేక ఆ విభాగంలో పుషింగ్స్ తగ్గిపోతున్నాయి. దాంతో వాయువులు కూడా తక్కువగా వస్తున్నాయి. ఆ మేరకు రోలింగ్ మిల్స్ అన్నింటినీ కాకుండా ఒకసారి నాలుగు, మరోసారి ఐదు చొప్పున నడుపుతున్నారు. దాంతో అక్కడ 100 శాతం ఉత్పత్తి రాలేదు. పనిచేయడానికి ఉద్యోగులు ప్లాంటులోనే పూర్తి సమయం ఉన్నా, వాయువులు లేక వీలు కాలేదు. దానికి లక్ష్యం మేరకు ఉత్పత్తి లేదంటూ వారి జీతాల్లో కోత పెట్టారని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విధానం రాజ్యంగబద్ధం కాదని, డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) ఫిర్యాదు చేశామని, అక్కడి నుంచి వివరణ కోరినా, ఇక్కడి సీఎండీ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖాతరు చేయకుండా ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి, ఉత్పత్తి ఆధారిత జీతాలే మళ్లీ మంజూరుచేశారని వాపోతున్నారు. కొత్త సీఎండీ అయినా దీనిపై దృష్టిసారించి తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.