మురిసిన వరి పైరు
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:54 PM
ఎస్‌ఎంఐ అధికారి ముందుచూపు, కూటమి ప్రభుత్వం చొరవ అక్కడ రైతులు ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించారు. ములకలపాడు చెక్‌డ్యామ్ మరమ్మతులకు ఎస్‌ఎంఐ అధికారి పంపిన ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అక్కడ 600 ఎకరాల్లో వరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి.
ఎస్‌ఎంఐ అధికారి ముందు చూపుతో ములకలపాడు చెక్‌డ్యామ్‌కు మరమ్మతులు
గర్భం, కాలువల్లో పూడిక తొలగింపు
చెక్‌డ్యామ్‌లో పుష్కలంగా సాగునీరు
కళకళలాడుతున్న వరి పొలాలు
ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించిన రైతులు
కొయ్యూరు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో ములకలపాడు చెక్‌డ్యామ్ మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపుతో ఎల్‌నినో పరిస్థితులను రైతులు అధిగమించారు. బూదరాళ్ల చెక్‌డ్యామ్ మిగులు నీరు వృథాగా పోకుండా పంట పొలాలకు సాగునీరందేలా చీడిపాలెం సమీప ములకలపాడు వద్ద రెండు దశాబ్దాల క్రితం ములకలపాడు చెక్‌డ్యామ్ నిర్మించారు. ఈ చెక్‌డ్యామ్ ఆధారంగా చీడిపాలెం, ములకలపాడు, శింగవరం తదితర గ్రామాలకు చెందిన 600 ఎకరాలకు రెండు పంటలకు సరిపడా సాగునీరు పుష్కలంగా అందుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ చెక్‌డ్యామ్ మరమ్మతులపై నిర్లక్ష్యం చూపడంతో చెక్‌డ్యామ్ గర్భంతోపాటు కుడి, ఎడమ కాలువలు పూడికతో నిండిపోయాయి. అలాగే కాలువల గోడలు అక్కడక్కడ శిథిలమై చెక్‌డ్యామ్‌కు చేరిన నీరు వృథా పోయి ఆయకట్టు భూములకు గత ఆరేళ్లుగా సాగునీరందని పరిస్థితి నెలకొంది. ఇది గుర్తించిన చిన్నతరహా సాగునీటిపారుదల శాఖ(ఎస్‌ఎంఐ) జేఈ రామకృష్ణ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చెక్‌డ్యామ్ గర్భం, కాలువల్లో పూడికను తీయించేందుకు రూ.10 లక్షల అంచనాతో ప్రతిపాదనలను గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వానికి నివేదించారు. కూటమి ప్రభుత్వం స్పందించి చెక్‌డ్యామ్, కాలువలు మరమ్మతులకు వీలుగా రూ.4 లక్షలు, వీబీ జీరామ్‌జీ పథకంలో పూడికతీతకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో గత డిసెంబరులో చెక్‌డ్యామ్ మరమ్మతు పనులు ప్రారంభించి కేవలం రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయడంతో అడపాదడపా కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్‌లో నీటి నిల్వలు పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు జాడ లేకున్నా ఖరీఫ్ సాగుకు వీలుగా 600 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. దీంతో ఆయకట్టు రైతులు సాగుకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆయకట్టు భూములు పచ్చని పైరుతో కళకళలాడుతున్నాయి. చెక్‌డ్యామ్ మరమ్మతులకు వీలుగా నిధులు కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వానికి, ఇంజనీర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.