మరో 2 రోజులు అప్రమత్తం
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:17 AM
తీవ్ర వాయుగుండం తీరం దాటినా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.
అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్
విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించండి
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం తీరం దాటినా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీవర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి అన్ని వసతులు కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు.
అధికారుల సహాయక చర్యలు
కాగా భారీవర్షాలకు కొండ చరియలు జారిపడడంతో కైలాసపురంలో 12 కుటుంబాలను, వెంకోజీపాలెం ప్రాంతంలో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇంకా కొమ్మాదిలో రేకుల షెడ్ కూలిన ఘటనలో 15 కుటుంబాలను, మధురవాడ, రామకృష్ణాపురం, పెదగంట్యాడ, బర్మాకాలనీ, హెచ్‌బీ కాలనీల్లో 70 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దండుబజారులో విద్యుత్ స్తంభం కూలి ఒకరు గాయపడ్డారు. జిల్లాలో ఐదు ఇళ్లు పూర్తిగా కూలిపోగా ఆరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
1న మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ
డాబాగార్డెన్స్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
బ్యాంకుల బంద్ నేపథ్యంలో అక్టోబరు ఒకటో తేదీన పింఛన్ల పంపిణీకి సంబంధించి ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారని డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం బ్యాంకుల నుంచి అవసరమైన నగదును డ్రా చేసి, మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. ఎంపీడీవోలు, జోనల్ కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సంబంధిత బ్యాంకు శాఖలకు ముందస్తుగా సమాచారం అందించి, సమన్వయం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ ఆదేశించారు.
ముగిసిన జడ్పీ పాలకవర్గ పదవీకాలం
నేటి నుంచి కొత్త జడ్పీలు ఏర్పాటు
ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికగా జిల్లా పరిషత్ కార్యాలయాలు శుక్రవారం ప్రారంభించనున్నారు. విశాఖపట్నం జడ్పీ కార్యాలయం యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జడ్పీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా ఏర్పాటుచేస్తున్న కార్యాలయాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలకు సీఈవోలుగా ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో అనకాపల్లి జడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లా జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, అల్లూరి జడ్పీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమానికి డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్ హాజరవుతున్నారు. కాగా జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆయా జిల్లాల జడ్పీలకు ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. విశాఖ జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు తీసుకుంటారని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా పాలకవర్గ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర గురువారం సాయంత్రం జడ్పీ కార్యాలయానికి వచ్చి అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్‌ను ఆమె సత్కరించారు. కొత్త జడ్పీల ఏర్పాటుతో ఆయా జిల్లాలకు కేటాయించిన సిబ్బందిని గురువారం సాయంత్రం సీఈవో రిలీవ్ చేశారు. వారంతా శుక్రవారం ఉదయం ఆయా జిల్లాల్లో రిపోర్టు చేయాలని సూచించారు. జిల్లాలకు వెళ్లే సిబ్బందితో అధికారులు గ్రూప్ ఫొటో దిగారు.