Share News

చురుగ్గా స్టేషన్‌ పునర్ నిర్మాణం

ABN , Publish Date - May 31 , 2026 | 12:53 AM

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పుంజుకున్నాయి.

చురుగ్గా స్టేషన్‌ పునర్ నిర్మాణం

బడ్జెట్‌ రూ.500 కోట్ల నుంచి దశల వారీగా రూ.వేయి కోట్లకు పెంపు

అదనంగా ఆరు ప్లాట్‌ఫారాలు

ప్రవేశ ద్వారం వైపు గ్రౌండ్‌+2 మోడల్‌లో టెర్మినల్‌ భవనం

జ్ఞానాపురం వైపు పార్కింగ్‌ ఏర్పాట్లు పూర్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పుంజుకున్నాయి. ఆరంభ దశలో కాంట్రాక్టర్ల వివాదంతో ఏడాదిన్నర ఆగిపోయిన పనులు ఇటీవల ఊపందుకున్నాయి. సుమారు రూ.500 కోట్ల అంచనాతో ప్రారంభమైన పనులకు దశల వారీగా వేయి కోట్ల వరకు వెచ్చిస్తామని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటవుతున్న నేపథ్యంలో అదేస్థాయిలో స్టేషన్‌ కూడా ఉండాలని అధికారులు ముందుగానే ప్రణాళిక రూపొందించారు. స్టేషన్‌కు కొత్త రూపు తీసుకురావడంతో పాటు అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డీపీఆర్‌ తయారు చేసి ఆమోదం పొందారు. దాని ప్రకారం ప్రస్తుతం రైల్వే స్టేషన్‌ను జ్ఞానాపురం వైపు విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఎనిమిది ప్లాట్‌ఫారాలు ఉండగా అదనంగా మరో ఆరు నిర్మించనున్నారు. అప్పుడు మొత్తం ప్లాట్‌ఫారాల సంఖ్య 14కు చేరుతుంది. దీంతో మరిన్ని కొత్త రైళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. స్టేషన్‌ను ‘యు’ ఆకారంలో అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణికులు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది. కోల్‌కత్తాలో మాదిరిగా షాపింగ్‌ కోసం ప్రత్యేక నిర్మాణం (కాంకోర్‌) కూడా ప్లాన్‌ చేశారు. ప్రస్తుత ప్రవేశ ద్వారం ఉన్న వైపు టెర్మినల్‌ భవనాన్ని గ్రౌండ్‌+2 మోడల్‌లో నిర్మిస్తారు. ఆ తరువాత జి+5కు విస్తరిస్తారు. అటు జ్ఞానాపురం వైపు రైల్వే రిజర్వేషన్‌ కాంప్లెక్స్‌, పార్కింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. మొదట మల్టీలెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం నిర్మించాలని అనుకున్నారు. కానీ అందుబాటులో భూమి ఉండడంతో ఓపెన్‌ పార్కింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. సుమారుగా 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో రెండు వేల వాహనాలు (కార్లు+ద్విచక్ర వాహనాలు) పట్టేలా కవర్డ్‌ పార్కింగ్‌ నిర్మాణం పూర్తిచేశారు. దీనికి ఏఐ టెక్నాలజీ ఆధారిత ప్రవేశం ఏర్పాటుచేసే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఎర్రిగెడ్డ మళ్లింపు పనులు కూడా చేపట్టారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


చరిత్ర పుటల్లోకి వాల్తేరు డివిజన్‌

రేపటి నుంచి విశాఖపట్నం డివిజన్‌

పరిధి పరిమితం

విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):

‘వాల్తేరు డివిజన్‌’ పేరు కనుమరుగైపోతోంది. పరిధి తగ్గించుకొని, కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతాలతో కొత్తగా ‘విశాఖపట్నం డివిజన్‌’గా నామకరణం చేసుకొని దక్షిణ కోస్తా జోన్‌లో ఒకటిగా కొనసాగనున్నది. వాల్తేరు డివిజన్‌కు సరకు రవాణాలో జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. అత్యధిక ఆదాయంతో ఐదో స్థానంలో నిలిచేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అధిక ఆదాయం తెచ్చే కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌ ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిపోయింది. దాంతో ఆదాయం అటు రాయగడ, విశాఖపట్నం డివిజన్లు పంచుకునే పరిస్థితి వచ్చింది. ఈ రెండూ వేర్వేరు జోన్లు. కాబట్టి విశాఖపట్నం కేంద్రంగా ఉండే డివిజన్‌కు ఇకపై సరకు రవాణా ద్వారా ఆ స్థాయి ఆదాయం రాకపోవచ్చు. కానీ కొత్తగా తన ఉనికిని చాటుకుని, ప్రత్యేకతను నిలుపుకొనేందుకు అనేక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో వాల్తేరు డివిజన్‌ 1,106 కి.మీ. పరిధిలో ఉండగా, అందులో రాయగడ డివిజన్‌కు 541 కి.మీ., ఖుర్దా డివిజన్‌కు 115 కి.మీ. ఇచ్చేసి మిగిలిన 460 కి.మీ.తో విశాఖపట్నం డివిజన్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - May 31 , 2026 | 12:58 AM