అంకుర కేంద్రం సిద్ధం
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:42 AM
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూ.3.75 కోట్లతో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ (అంకుర కేంద్రం) ప్రారంభోత్సవానికి సిద్ధంగా వుంది.
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రూ.3.75 కోట్లతో నిర్మాణం
పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ
అనకాపల్లిఅగ్రికల్చర్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూ.3.75 కోట్లతో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ (అంకుర కేంద్రం) ప్రారంభోత్సవానికి సిద్ధంగా వుంది. ఈ కేంద్రంలో ఆధునిక బెల్లం తయారీ యూనిట్, బెల్లంతో తయారు చేసే విలువ ఆధారిత ఉత్పత్తుల యూనిట్, చిరుధాన్యాల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రం వున్నాయి. మూడు అంచెలలో చెరకు రసం మరిగించే పెనాలు, ఇతర ఆధునిక బెల్లం తయారీ యంత్రాల ఏర్పాటు ఇప్పటికే పూర్తయ్యిందని పోస్ట్ హర్వెస్ట్ టెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీకే జగన్నాఽథరావు తెలిపారు. దీని నిర్వహణ బాధ్యతను ఒక ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్‌కు అప్పగించామని, వారు అద్దెతోపాటు వచ్చే లాభాల్లో 18 శాతం సొమ్మును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెల్లిస్తారని వివరించారు. ఎలాంటి రసాయినాలు కలపకుండా ఆధునిక పద్ధతిలో నాణ్యమైన బెల్లం, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ఈ కేంద్రం ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. చిరుధాన్యాలతో, పనస కాయలు, పండ్లతో వివిధ రకాలైన తినుబండారాలను ఇక్కడ తయారు చేస్తారని చెప్పారు. ఈ కేంద్రంలో ఆహార పరీక్షల పరిశోధనశాలను (ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్) కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. అతి త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రాంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్టు డాక్టర్ జగన్నాఽథరావు తెలిపారు.