Share News

రేపటి నుంచి మాజీలే!

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:31 AM

పురపాలక సంఘానికి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల అనంతరం ఏర్పడిన పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది.

రేపటి నుంచి మాజీలే!

నర్సీపట్నం మునిసిపల్‌ పాలకవర్గం పదవీ కాలం నేటితో ముగింపు

18 నుంచి ప్రత్యేక అధికారి పాలన

నేడు కౌన్సిల్‌ చివరి సమావేశం

నర్సీపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):

పురపాలక సంఘానికి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల అనంతరం ఏర్పడిన పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది. దీంతో బుధవారం నుంచి చైర్‌పర్సన్‌తోసహా కౌన్సిలర్లందరూ మాజీలు కానున్నారు. నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం మేజర్‌ పంచాయతీలను కలిసి 2011లో ప్రభుత్వం నర్సీపట్నం మునిసిపాలిటీని ఏర్పాటు చేసింది. 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు రావడంతో అధికార పగ్గాలు చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2021 మార్చి 10న రెండోసారి జరిగిన ఎన్నికలో ఆ పార్టీ పాగా వేసింది. 28 వార్డులకుగాను వైసీపీ 14, టీడీపీ 12, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. మార్చి 18న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్‌పర్సన్‌ పదవికి గుడబండి ఆదిలక్ష్మి, బోడపాటి సుబ్బలక్ష్మి పోటీ పడగా, నాటి ఎమ్మెల్యే గణేశ్‌ వీరిమధ్య రాజీ చేశారు. ఇరువురు చెరో రెండు సంవత్సరాలు, చివరి సంవత్సరం స్వతంత్ర కౌన్సిలర్‌ చెక్కా బాలమ్మకి చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల బాలమ్మకి చైర్‌పర్సన్‌ పదవి దక్కలేదు. తొలి రెండేళ్లు చైర్‌పర్సన్‌గా గుడబండి ఆదిలక్ష్మి, వైస్‌చైర్మన్‌ -1గా గొలుసు నరసింహమూర్తి, వైస్‌ చైర్మన్‌-2గా తమరాన అప్పలనాయుడు, తరువాత చైర్‌పర్సన్‌గా బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌చైర్మన్‌-1గా కోనేటి రామకృష్ణ పదవీ ప్రమాణం చేశారు. చైర్‌పర్సన్‌-2 పదవిలో తమరాన అప్పలనాయుడు ఐదేళ్లు కొనసాగారు.

రేపటి నుంచి ప్రత్యేక అధికారి పాలన

మునిసిపల్‌ కౌన్సిల్‌ చివరి సమావేశాన్ని మంగళవారం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం కౌన్సిలర్లు గ్రూప్‌ ఫొటో దిగుతారు. అంతాకలిసి భోజనాలు చేస్తార. పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారిగా ఆర్డీవో వీవీరమణను ప్రభుత్వం నియమించింది. 18వ తేదీన ఆయన బాధ్యతలు చేపడతారు. మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగే వరకు, లేదా ఆరు నెలలపాటు (ఏది ముందైతే) ఆయన ప్రత్యేక అధికారిగా వుంటారు.

Updated Date - Mar 17 , 2026 | 01:31 AM