ప్లాస్టిక్ నిషేధంపై పంతాలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:24 AM
పట్టణంలో తక్కువ మందం కలిగిన పాలిథిన్/ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అంశంపై మునిసిపల్ అధికారులు, దిమిలి రోడ్డు జంక్షన్‌లోని కూరగాయల వ్యాపారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నది. పారిశుధ్య సిబ్బంది ఇక్కడి కూరగాయాల మార్కెట్ వద్ద వారం రోజుల నుంచి చెత్తను తొలగించడంలేదు. దీంతో చెత్త కుప్ప పేరుకుపోవడంతోపాటు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. అటు మునిసిపల్ అధికారులు, ఇటు కూరగాయల వ్యాపారుల తీరుతో తాము ఇబ్బంది పడుతున్నామని సాధారణ ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
ఎలమంచిలిలో కూరగాయల వ్యాపారులు, అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
గడువు తరువాత కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకంపై ఆగ్రహం
కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య పనులు నిలుపుదల
పేరుకుపోతున్న చెత్తాచెదారం
కుళ్లిపోయి తీవ్ర దుర్వాసనతో స్థానికుల ఇక్కట్లు
ఎలమంచిలి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో తక్కువ మందం కలిగిన పాలిథిన్/ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అంశంపై మునిసిపల్ అధికారులు, దిమిలి రోడ్డు జంక్షన్‌లోని కూరగాయల వ్యాపారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నది. పారిశుధ్య సిబ్బంది ఇక్కడి కూరగాయాల మార్కెట్ వద్ద వారం రోజుల నుంచి చెత్తను తొలగించడంలేదు. దీంతో చెత్త కుప్ప పేరుకుపోవడంతోపాటు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. అటు మునిసిపల్ అధికారులు, ఇటు కూరగాయల వ్యాపారుల తీరుతో తాము ఇబ్బంది పడుతున్నామని సాధారణ ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మునిసిపల్ కమిషన్ ప్రసాదరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు కలిసి గత నెల 26వ తేదీన దిమిలి రోడ్డులోని కూరగాయల మార్కెట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. తక్కువ మందం కలిగిన పాలిథిన్/ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, ఇందుకు వ్యాపారులంతా సహకరించాలని కోరారు. ఇందుకు వారం రోజులు సమయం ఇస్తున్నామని, ఆ తరువాత కూడా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే.. ఇక్కడి నుంచి చెత్తాచెదారాన్ని పారిశుధ్య సిబ్బంది సేకరించరని అధికారులు స్పష్టం చేశారు. వీరు విధించిన గడువు ముగిసిన తరువాత కూడా వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తుండడంతో మునిసిపల్ అధికారులు అన్నంత పని చేశారు. కూరగాయల మార్కెట్ ప్రాంతం నుంచి చెత్తాచెదారాన్ని పారిశుధ్య సిబ్బంది తీసుకెళ్లడంలేదు. సుమారు వారం రోజుల నుంచి చెత్త తొలగించకపోవడంతో కుప్పలా పేరుకుపోయింది. దీంతో కూరగాయల వ్యాపారులు, మునిసిపల్ మాజీ ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి చెత్త సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లను యథావిధిగా వినియోగిస్తున్నారని, కానీ కూరగాయల మార్కెట్ ప్రాంతంలోనే నిబంధనలు అమలు చేయడం ఏమిటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఇటు వ్యాపారులు, అటు మునిసిపల్ అధికారులు ఎవరికి వారు పంతాలకు పోవడంతో దిమిలి రోడ్డు జంక్షన్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద చెత్త పేరుకుపోతున్నది. అప్పుడప్పుడు వర్షం కురుస్తుండడంతో చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.