Share News

నిలువు కాళ్లపైనే...

ABN , Publish Date - May 24 , 2026 | 12:48 AM

ప్రొలాంగ్‌ స్టాండింగ్‌ జాబ్‌...ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా, ఎంతోమంది చేస్తున్న ఉద్యోగాలు ఇవే.

నిలువు కాళ్లపైనే...

అనేక వృత్తుల్లో గంటల తరబడి నిల్చుని పని చేయాల్సిన పరిస్థితులు

దుకాణాల్లో ఎనిమిది నుంచి పది గంటలు...

ప్రైవేటు/కార్పొరేటు స్కూల్స్‌/కళాశాలల్లోనూ అంతే

క్లాస్‌ రూమ్స్‌లో కానరాని కుర్చీలు

సెక్యూరిటీ గార్డులు, కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగులూ నిలబడాల్సిందే

అన్నేసి గంటలు నిల్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు

దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందంటున్న వైద్యులు

కొన్ని రాష్ట్రాల్లో కూర్చునే వెసులుబాటు కల్పిస్తున్న చట్టాలు

ఇక్కడా అవసరమంటున్న ఉద్యోగులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రొలాంగ్‌ స్టాండింగ్‌ జాబ్‌...ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా, ఎంతోమంది చేస్తున్న ఉద్యోగాలు ఇవే. వస్త్ర దుకాణానికి వెళ్లినా, జ్యువెలరీ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడూ నిలబడే ఉంటారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. అనేక ప్రైవేటు/కార్పొరేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో కూడా టీచర్లు తరగతి గదిలో కూర్చునేందుకు అవకాశం ఉండదు. క్లాస్‌లో ఉన్నంత సేపూ నిలబడి ఉండాల్సిందే. ఇక సెక్యూరిటీ గార్డులు, అనేక పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా గంటలపాటు నిల్చుని పని చేస్తుంటారు. ఇలా గంటల తరబడి నిలబడి పనిచేసే ఉద్యోగాలనే ‘ప్రొలాంగ్‌ స్టాండింగ్‌ జాబ్స్‌’గా పేర్కొంటారు. ముఖ్యంగా రిటైల్‌ రంగంలో పనిచేసే ఉద్యోగులంతా నిలబడి పని చేయాల్సిన దుస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మార్పు కోసం కేరళలో మహిళా ఉద్యోగులు పెద్ద పోరాటం చేశారు. పనిచేసే చోట కూర్చునే హక్కును (రైట్‌ టు సిట్‌) సాధించుకున్నారు. ఇదే విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. అయితే, ఇలా నిలబడి పనిచేసే ఉద్యోగుల గురించి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఆలోచించడం లేదు. ప్రతి నగరంలో ఈ తరహా ఉద్యోగాలు చేస్తున్నవారు వేలాది మంది ఉన్నారు. వారంతా శారీరకంగానే కాకుండా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం పని లేని సమయంలోనైనా కూర్చునే అవకాశాన్ని కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

వేలాది మంది ఉద్యోగులు

విశాఖ నగరంలో నిల్చుని పనిచేసే ఉద్యోగులు వేలాది మంది ఉన్నారు. వస్త్ర దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, గోల్డ్‌ షోరూమ్‌లలో సేల్స్‌ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు గంటల తరబడి నిల్చుని ఉండాల్సి వస్తుంది. టీచర్లు తరగతి గదుల్లో నిల్చునే పాఠాలు చెబుతుంటారు. అయితే మధ్యలో కాస్త విరామం వస్తుంటుంది. రిటైల్‌ రంగంలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఉదయం షోరూమ్‌కు వెళ్లిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మినహా రాత్రి బయటకు వచ్చేంత వరకు నిలబడే ఉండాలి. కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు నిలబడి పనిచేయాల్సిన పరిస్థితి. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో పురుషులతో పోలిస్తే మహిళలు అధికంగా ఉంటున్నారు. ఒక్కోసారి కాళ్లపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి నరకం కనిపిస్తుందని, కానీ, కూర్చునే అవకాశం ఉండదని ఒక ప్రముఖ షోరూమ్‌లో పనిచేసే యువతి పేర్కొన్నారు. పీరియడ్స్‌ సమయంలో కాళ్లలో శక్తి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటామని, సెలవులు పెట్టే అవకాశం కూడా లేకపోవడంతో బాధను భరిస్తూనే పనిచేస్తుంటామని గోల్డ్‌ షోరూమ్‌లో పనిచేసే ఉద్యోగిని వాపోయారు. బిజినెస్‌ జరుగుతున్న సమయంలో కూర్చోవడానికి సాధ్యం కాదని, కనీసం వినియోగదారులు లేనప్పుడు కూర్చునే అవకాశం కల్పిస్తే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న మహిళ అభిప్రాయపడ్డారు.

కొంత సమయమైనా విశ్రాంతి తీసుకోవాలి

- డాక్టర్‌ ఎం.చంద్రశేఖరంనాయుడు, ఎముకల వైద్య నిపుణులు, కేజీహెచ్‌

గంటల తరబడి నిలబడి పనిచేసే ఉద్యోగుల్లో అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాళ్ల నొప్పి, పాదాల్లో మంట, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి వంటివి వేధిస్తుంటాయి. మహిళలు, 40 ఏళ్లు దాటిన వారిలో అయితే కాళ్ల వాపులు, అలసట, బలహీనత, పాదాల కండరాలు గట్టిపడడం వంటి సమస్యలు వస్తాయి. గంటల తరబడి పనిచేసే ఉద్యోగులను దీర్ఘకాలంలో కొన్నిరకాల తీవ్రమైన ఇబ్బందులు వేధించే అవకాశం ఉంది. కాబట్టి, గంటకు ఒకసారి అయినా రెండు, మూడు నిమిషాలు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఒకే పొజిషన్‌లో నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలి. కాళ్లలో స్పర్శ లేకపోయినా, తిమ్మిర్లు పెరుగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. అధిక బరువు ఉన్న వాళ్లు, గర్భిణులు, వయసు పెరిగినవాళ్లు, షుగర్‌, బీపీ ఉన్న వాళ్లు గంటలు తరబడి నిలబడి పనిచేయడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, జాగ్రత్త వహించాలి.

Updated Date - May 24 , 2026 | 12:48 AM