Share News

నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లు

ABN , Publish Date - Mar 06 , 2026 | 01:27 AM

రాష్ట్ర అవసరాలకు రూ.16 కోట్ల విలువైన స్టాంపు పేపర్లు నాసిక్‌ నుంచి వచ్చాయి.

నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లు

ఈసారి విశాఖ అధికారులకు డ్యూటీ

రెండు లారీలు, ముగ్గురు ఎస్కార్ట్‌తో పయనం

రూ.16 కోట్ల విలువైన స్టాంపులతో రాక

అందులో రూ.1.6 కోట్ల విలువైనవి జిల్లాకు కేటాయింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర అవసరాలకు రూ.16 కోట్ల విలువైన స్టాంపు పేపర్లు నాసిక్‌ నుంచి వచ్చాయి. అందులో రూ.1.6 కోట్ల విలువైన స్టాంపులను విశాఖ జిల్లాకు కేటాయించారు. వాటిని జిల్లాలో తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపిణీ చేశారు. ఈసారి విశాఖ జిల్లా రిజిస్ట్రార్‌ ఉపేంద్ర స్వయంగా నాసిక్‌ వెళ్లి లారీలతో వాటిని తీసుకువచ్చారు. అదే విశేషం.

కాగితాలపై రాసుకునే ఆర్థిక లావాదేవీలు చెల్లుబాటు కావాలంటే స్టాంపులు తప్పనిసరి. స్థిరాస్తుల కొనుగోళ్లకు రిజిస్ట్రేషన్‌ స్టాంపు పేపర్లు, ఆథరైజేషన్‌కు రెవెన్యూ స్టాంపులు, న్యాయస్థాన వ్యాజ్యాల కోసం కోర్టు ఫీజు స్టాంపులు, ప్రత్యేక స్టాంపులు...ఇలా అనేకం చలామణిలో ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల లభించవు. మహారాష్ట్రలోని నాసిక్‌ సెక్యూరిటీ ప్రెస్‌లో మాత్రమే ముద్రిస్తారు. అక్కడి నుంచి తెప్పించుకోవాలి. అదొక పెద్ద ప్రక్రియ. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు స్వయంగా నాసిక్‌ వెళ్లి తెచ్చుకోవాలి. ఇందుకు అవసరమైన వాహనాలను, వాటికి సెక్యూరిటీని కూడా ఇక్కడి నుంచే తీసుకువెళ్లాలి. రోడ్డు మార్గాన వెళ్లి, రోడ్డు మార్గంలోనే రావాలి. మనం రూ.100 పెట్టి కొనే స్టాంపు పేపరు వెనుక ఇంత వ్యవహారం దాగి ఉంది.

ప్రభుత్వం ఇండెంట్‌ పెడితేనే..

రాష్ట్రంలో అవసరాలు ఏమిటో అంచనా వేసి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నాసిక్‌లోని అధికారులకు ముందుగానే ఇండెంట్‌ పెడుతుంది. ఆ మేరకు వారు వాటిని ముద్రించి, పని పూర్తయ్యాక వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా సమాచారం పంపుతారు. ఆ లేఖను డీజీపీకి పంపిస్తే, ముగ్గురు గన్‌మెన్లతో కూడిన ఎస్కార్ట్‌ ఇస్తారు. అదే లేఖ తపాలా శాఖకు పంపిస్తే, వారు స్టాంపుల విలువ, సంఖ్యను బట్టి వాహనాలు సమకూరుస్తారు. ఆ వాహనాల్లో ఎస్కార్ట్‌ను ఎక్కించుకొని రోడ్డు మార్గంలో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెళ్లాలి. ఒక్కోసారి ఒక్కో జిల్లాకు ఈ బాధ్యత ఇస్తారు. ఈసారి విశాఖ జిల్లా వంతు వచ్చింది. జిల్లా రిజిస్ట్రార్‌ ఉపేంద్ర ఫిబ్రవరి నెలాఖరున బయలుదేరి వెళ్లి మూడు రోజుల్లో తిరిగి వచ్చారు. రెండు లారీలలో స్టాంపులు తీసుకువచ్చి విజయవాడ ఐజీ కార్యాలయంలో అప్పగించారు. అందులో రూ.1.6 కోట్ల విలువైన స్టాంపులు విశాఖ జిల్లాకు వచ్చాయి.

3 నెలలు సరిపోతాయి

ఉపేంద్ర, జిల్లా రిజిస్ట్రార్‌

ప్రభుత్వం అందించిన స్టాంపు పేపర్లు మూడు నెలలకు మాత్రమే సరిపోతాయి. ఆ తరువాత మళ్లీ ఇండెంట్‌ పెట్టి తెప్పించుకోవలసిందే. వీటిని లైసెన్స్‌ పొందిన వెండర్లు మాత్రమే విక్రయించాలి. ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలతో రికార్టులు నిర్వహించాలి. వాటిని ఆడిట్‌ చేస్తాం.

Updated Date - Mar 06 , 2026 | 01:27 AM