Share News

సాగని ఖరీఫ్‌

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:48 AM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావం పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జూన్‌, జూలై నెలలతో పోలిస్తే ఆగస్టులో ఒకింత ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. వరి సాగుకు అవసరమైన మేర పడడంలేదు. దీంతో వరినాట్లు వేయడానికి రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. విద్యుత్తు మోటార్లు వున్న బోర్లు, బావులతోపాటు రిజర్వాయర్ల కింద వరినాట్లు మందకొడిగా సాగుతుండగా.. మిగిలిన నీటి వనరుల ఆయకట్టు భూముల్లో కనీసం దుక్కి కూడా దున్నని పరిస్థితి నెలకొంది. ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో పలువురు రైతులు గత నెలలో వరి నారుమడులు పోశారు. తరువాత అనుకున్న మేర వర్షాలు పడకపోవడంతో వరినారును కాపాడుకోవడానికి నానాపాట్లు పడ్డారు. సుదూరంలో వున్న బావులు, బోర్లు నుంచి పైపులు వేసుకొని నారుమడులను తడుపుకోవాల్సి వచ్చింది. తీరా నారు అందుబాటులోకి వచ్చిన తరువాత పొలాన్ని దమ్ముపట్టడానికి నీరు లేకపోవడం, తగినంత వర్షం పడకపోవడంతో నారు ముదిరిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగని ఖరీఫ్‌
చోడవరం మండలం ఖాళీగా ఉన్న పంటపొలాలు

వరి నాట్లకు మించిపోతున్న అదను

అరకొర వర్షాలతో నాట్లు వేయలేని పరిస్థితి

నారును కాపాడుకోవడానికి అన్నదాతల పాట్లు

చోడవరం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావం పరిస్థితులతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జూన్‌, జూలై నెలలతో పోలిస్తే ఆగస్టులో ఒకింత ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. వరి సాగుకు అవసరమైన మేర పడడంలేదు. దీంతో వరినాట్లు వేయడానికి రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. విద్యుత్తు మోటార్లు వున్న బోర్లు, బావులతోపాటు రిజర్వాయర్ల కింద వరినాట్లు మందకొడిగా సాగుతుండగా.. మిగిలిన నీటి వనరుల ఆయకట్టు భూముల్లో కనీసం దుక్కి కూడా దున్నని పరిస్థితి నెలకొంది. ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయన్న ఉద్దేశంతో పలువురు రైతులు గత నెలలో వరి నారుమడులు పోశారు. తరువాత అనుకున్న మేర వర్షాలు పడకపోవడంతో వరినారును కాపాడుకోవడానికి నానాపాట్లు పడ్డారు. సుదూరంలో వున్న బావులు, బోర్లు నుంచి పైపులు వేసుకొని నారుమడులను తడుపుకోవాల్సి వచ్చింది. తీరా నారు అందుబాటులోకి వచ్చిన తరువాత పొలాన్ని దమ్ముపట్టడానికి నీరు లేకపోవడం, తగినంత వర్షం పడకపోవడంతో నారు ముదిరిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చోడవరం మండలంలోని గౌరీపట్నం, బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది ప్రాంతాలలో ఉన్న భూములకు కస్పా కాలువ నీరే ఆధారం. పెద్దేరు గెడ్డ ద్వారా ఈ కాలువకు నీరు ఎక్కుతుంది. దీంతో వడ్డాది ప్రాంతంలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకుంటున్నారు. మరికొంతమంది దమ్ము పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడ వరి పొలాలకు నీరు సరిపోయిన తరువాతే గౌరీపట్నం పొలాలకు నీరు వస్తుంది. దీంతో వరి నారు ముదిరిపోతున్నదని గౌరీపట్నం రైతులు వాపోతున్నారు. కనీసం వరి నారుమడులకు కూడా కస్పా కాలువ నుంచి నీరు రాకపోవడంతో సమీపంలోని గెడ్డల్లో నుంచి బకెట్లు, బిందెలతో నీటిని తెచ్చి వరినారును కాపాడుకుంటున్నారు.

చోడవరం మండలంలో పెద్దేరు, బొడ్డేరు, శారదా నది పరివాహక ప్రాంతాలైన జి.జగన్నాథపురం, గవరవరం, జుత్తాడ వంటి కొన్ని పంచాయతీల్లో కొంతమేర వరినాట్లు పడుతుండగా, మిగిలిన పంచాయతీల్లో వరినాట్లు అటుంచి కనీసం దమ్ములకు కూడా నీరు లేని పరిస్థితి నెలకొంది. ఇక పూర్తిగా వర్షంపై ఆఽధారపడిన దుడ్డుపాలెం, అడ్డూరు, నరసాపురం, రాయపురాజుపేట, ఽశేమునాపల్లి, బెన్నవోలు, జన్నవరం, చాకిపల్లి, కన్నంపాలెం, తిమ్మనపాలెం తదితర పంచాయతీల్లో పొలాలు దుక్కిదున్నకపోవడంతో బీడులను తలపిస్తున్నాయి.

వరినారును కాపాడుకోవడానికి..

గొర్లె మంగరాజు, గౌరీపట్నం

వడ్డాది కస్పా కాలువ కింద మా భూములు వున్నాయి. ఏటా ఈ సమయానికి కాలువలో పుష్కలంగా నీరు పారేది. వరినాట్లు వేస్తుండేవాళ్లం. కానీ కస్పా కాలవలో నీరు మా గ్రామం వరకు ఇంకా రాలేదు. నీరు ఎప్పటికి వస్తుందో తెలియదు. వరినారును కాపాడుకోవడానికి సమీపంలోని వాగులో నుంచి నీటిని తెచ్చి తడుపుకుంటున్నాను.

Updated Date - Aug 12 , 2026 | 12:48 AM