Share News

కదలని బీఎన్‌ రోడ్డు పనులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:09 AM

వర్షాకాలం ముగిసి రెండు నెలలు దాటినప్పటికీ భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డు పనుల్లో కదలిక లేదు.

కదలని బీఎన్‌ రోడ్డు పనులు

వర్షాకాలం ముగిసి రెండు నెలలు దాటినా మొదలుపెట్టని కాంట్రాక్టర్‌

ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు

అధ్వాన రహదారితో మరింత పెరిగిన ప్రయాణికుల కష్టాలు

చోడవరం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):

వర్షాకాలం ముగిసి రెండు నెలలు దాటినప్పటికీ భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డు పనుల్లో కదలిక లేదు. ఈ ఏడాది మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని, ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని గత నెలలో కోర్టు విచారణకు హాజరైన సందర్భంలో ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని కోర్టుకు లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చారు. సంక్రాంతి పండగ ముందు జిల్లా పర్యటనకు వచ్చిన ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జిల్లాలో వివిధ రహదారుల అభివృద్ధి పనులతోపాటు బీఎన్‌ రోడ్డు పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని ప్రకటించారు. అయినాసరే బీఎన్‌ రోడ్డు పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. రెండు నెలల క్రితం గోవాడ, వెంకన్నపాలెం గ్రామాల వద్ద కల్వర్టుల నిర్మాణానికి డైవర్షన్‌ రోడ్డు పనులు చేపట్టి, నాలుగు రోజులు హడావిడి చేసి ఆ తరువాత పూర్తిగా ఆపేశారు. బీఎన్‌ రోడ్డు పనులు పూర్తిచేయకపోవడానికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడమే కారణమంటూ ఇటీవల వరకు కాంట్రాక్టర్‌కు చెందిన ప్రతినిధులు చెబుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం ఇటీవల రూ.5 కోట్లు విడుదల చేయడంతోపాటు, గ్రాంటు కూడా అందుబాటులో ఉంచినట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. కానీ కాంట్రాక్టర్‌తో పనులు చేయించడంలో అధికారులు ఎందుకు విఫలం అవుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌డీబీ నిధులతో చేపట్టిన ఈ రహదారిలో కొన్ని వర్కులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును కూడా కేటాయించి టెండర్లు కూడా పిలిచింది. కానీ ప్రధానమైన రహదారి పనులను కాంట్రాక్టర్‌ మొదలుపెట్టలేదు.

దుమ్ము, ధూళితో అవస్థలు

ఉమ్మడి జిల్లా రవాణాలో కీలకమైన బీఎన్‌ రోడ్డు అధ్వానంగా వుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు నిర్వహణను గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినప్పటికీ పరిస్థితిలో అణువంతైనా మార్పులేదు. పైగా రవాణా కష్టాలు మరింత పెరిగాయి. అక్కడక్కడ గోతులను గ్రావెల్‌, కాంక్రీట్‌ మిక్చర్‌తో కప్పారు. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి ఎగిసి వాహచోదకులు ప్రయాణికుల కళ్లల్లో పడుతున్నది.

Updated Date - Jan 20 , 2026 | 01:09 AM