హోటళ్లలో నిల్వ ఆహారం!
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:56 AM
నిల్వ చేసిన మాంసాహారం, ఏమాత్రం నాణ్యత లేని ఆహారం, వంట గదుల్లో అపరిశుభ్ర వాతావరణం...ఇవీ నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపిన ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులకు కనిపించిన దృశ్యాలు.
అధికారుల తనిఖీల్లో మరోసారి బట్టబయలైన నిర్వాకం
కామత్ హోటల్‌లో 60 కిలోల నిల్వ చికెన్ గుర్తించిన అధికారులు
పిస్తా హౌస్‌లో 30 కిలోలు
ఆల్ఫా హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం
నోటీసులు జారీ చేసి కేసులు నమోదు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
నిల్వ చేసిన మాంసాహారం, ఏమాత్రం నాణ్యత లేని ఆహారం, వంట గదుల్లో అపరిశుభ్ర వాతావరణం...ఇవీ నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపిన ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులకు కనిపించిన దృశ్యాలు. డ్రగ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పి.అరుణ్‌బాబు నేతృత్వంలో అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు హోటల్స్, రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంట గదుల శుభ్రతలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. బీచ్‌రోడ్డులోని కామత్ హోటల్‌లో కోడి మాంసంతో తయారుచేసిన ఆహార పదార్థాలు సుమారు 60 కిలోల మేర నిల్వ ఉన్నవి గుర్తించారు. ఇంకా వంట గదిలో అపరిశుభ్ర వాతావరణం ఉండడం గుర్తించి నోటీసులు జారీచేశారు. ఆ గదిని సీజ్ చేశారు. అదేవిధంగా పిస్తా హౌస్‌లో సుమారు 30 కిలోల నిల్వ చేసిన చికెన్‌ను గుర్తించి ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో నోటీసులు జారీచేసి కేసు నమోదుచేశారు. జగదాంబ సెంటర్‌లోని ఆల్ఫా హోటల్‌లో వంట గది అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. అక్కయ్యపాలెంలోని ఈస్టర్న్ స్పైస్ రెస్టారెంట్‌లో ఆహార పదార్థాలు నాణ్యత లేకపోవడంతోపాటు వంట గది అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఆయా హోటళ్లలోని వంట గదులను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదుచేశామని అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో జాయింట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు కల్యాణ్‌చక్రవర్తి, వేణుగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, అప్పారావు, రవీంద్రరెడ్డి, శ్రీను, ఆనందరావు పాల్గొన్నారు.